Reading Time: 2 minutes
Shubman Gill Creates Rare Ipl Playoffs Record Surpasses Virat Kohli In Elite List

Shubman Gill IPL Playoffs Stats: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒత్తిడి, అంచనాలు, కీలక సందర్భాల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లే నిజమైన మ్యాచ్ విన్నర్లుగా గుర్తింపు పొందుతారు. కీలక ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా చోటు దక్కించుకున్నాడు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ లెజెండ్స్ సరసన నిలవడం విశేషం. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు ధర్మశాలలో తలపడనున్నాయి.

ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్టార్ సురేశ్ రైనా అగ్రస్థానంలో ఉన్నాడు. రైనా 714 పరుగులు చేసి.. 155.21 స్ట్రైక్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. రెండో స్థానంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 523 పరుగులతో కొనసాగుతున్నాడు. ధోనీ 132.07 స్ట్రైక్‌రేట్‌తో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గిల్ ఇప్పటివరకు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో 475 పరుగులు చేసి.. 144.81 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు.

శుభ్‌మన్ గిల్ కంటే ముందు సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలే ఉండటం జీటీ కెప్టెన్ స్థాయిని స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా ఇంత చిన్న వయసులోనే ప్లేఆఫ్స్‌లో ఇంత నిలకడైన ప్రదర్శన ఇవ్వడం విశేషం. గిల్ తర్వాత మిష్టర్ 60 సూర్యకుమార్ యాదవ్ 406 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 405 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. కింగ్ విరాట్ కోహ్లీ 396 పరుగులతో ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ గెలిస్తే.. శుభ్‌మన్ గిల్ మరో మ్యాచ్ ఆడుతాడు. ఓడినా ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 ఆడుతాడు. ఈ మ్యాచులలో గిల్ రాణిస్తే.. ఎంఎస్ ధోనీని అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 13 మ్యాచ్‌లలో 616 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్‌తో కలిసి గుజరాత్ టైటాన్స్‌కు బలమైన ఆరంభాలు అందిస్తూ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడే గిల్ సామర్థ్యం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతోంది. ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే భారీ రికార్డులు నమోదు చేసిన గిల్.. రాబోయే రోజుల్లో సురేష్ రైనా రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.