Reading Time: 2 minutes
Rcb Vs Gt Qualifier 1 Ipl 2026 Pitch Report Live Streaming And Head To Head Records

RCB vs GT Qualifier 1 Live Streaming: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరానికి తెరలేచింది. మంగళవారం జరిగే క్వాలిఫయర్‌-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ కీలక పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. దీంతో బెంగళూరు, గుజరాత్‌ జట్లు ఎలాగైనా విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తున్నాయి.

లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్:
లీగ్ దశలో ఆర్సీబీ, జీటీ జట్లు 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత సీజన్‌లో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరు.. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తూ టైటిల్ డిఫెండ్ చేయాలని చూస్తోంది. మరోవైపు గుజరాత్ మరోసారి ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. రెండు జట్లు బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. ఈ మ్యాచ్‌ స్టార్ స్పోర్ట్స్ లేదా జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, జీటీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సమానంగా నిలిచాయి. ఈ సీజన్‌లో కూడా రెండు జట్లు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో గెలిచాయి. ఏప్రిల్ 24న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఏప్రిల్ 30న జరిగిన పోరులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పైచేయి సాధించింది. దీంతో క్వాలిఫయర్-1లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం:
ఈ సీజన్‌లో ధర్మశాల హై స్కోరింగ్ గ్రౌండ్‌గా నిలిచింది. ముఖ్యంగా రాత్రి మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయాలు సాధించాయి. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని ఔట్‌ఫీల్డ్ కారణంగా బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండు సమాన బలాలున్న జట్లు తలపడుతుండటంతో ధర్మశాలలో అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్ గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇప్పుడు ఫైనల్‌కు తొలి అడుగు ఎవరు వేస్తారో చూడాలి.