Reading Time: < 1 minute
Mk Stalin Slams Vijay Tvk Government Cinema Tsunami Tamil Nadu

MK Stalin: డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాధించిన విజయాన్ని రాజకీయ సునామీ కాదని, సినిమా సునామీ అని అభివర్ణించారు. కొన్ని రోజుల తర్వాత ప్రజల్లో ఈ ఉత్సాహం తగ్గి మళ్లీ డీఎంకే వైపు చూస్తారని అన్నారు. విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. తమ అభిమాన నటుడు పార్రటీ ప్రారంభించడం వల్లే విజయ్‌కి ఓటేశారని చెప్పుకొచ్చారు. మెజారిటీ సాధించేందుకు అవసరమైన 118 సీట్లను విజయ్ గెలుచుకోలేకపోయాడని, డీఎంకే వల్లే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయడానికి టీవీకే శాయశక్తులా ప్రయత్నించి విఫలమైందని వ్యాఖ్యానించారు. విజయ్ ప్రభుత్వం ఏ క్షణమైన కూలిపోయే ‘‘గోడ మీద పిల్లి’’ లాంటి ప్రభుత్వం అని అన్నారు. కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్ బయట నుంచి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పి, ఇప్పుడు క్యాబినెట్‌లో భాగమయ్యారని అందుకు వారికి అభినందనలు అంటూ ఎద్దేవా చేశారు. ఒక బిడ్డ తన తల్లిని వెతుక్కున్నట్లే ప్రజలు త్వరలోనే తిరిగి డీఎంకే వైపు వస్తారని చెప్పారు.

స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిరంతరం ఎదుగుదలకు కాంగ్రెస్ కారణమని నిందించారు. దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తున్న విజయాలకు గతంలో నరేంద్రమోడీ, అమిత్ షా కారణమని తాను భావించానని, ఇప్పుడు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కనీస మర్యాద, కృతజ్ఞత లేవని, దానిని మళ్లీ ఎన్నటికీ నమ్మకూడదని ఉదయనిధి అన్నారు. ఇన్నాళ్లు తమ పార్టీ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోసిందని, వారి విజయాలకు డీఎంకే పార్టీ కార్యకర్తలు సహకరించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు టీవీకే ప్రభుత్వంలో భాగమైందని చెప్పారు.