
గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పందెం కోళ్లను తమ ప్రతిష్టకు, హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు అక్కడి జనం. సరిగ్గా ఆ కోడి పందాల బ్యాక్‌డ్రాప్‌ను నమ్ముకుని, క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సరికొత్త వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’. నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’లో మే 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ ఆరు ఎపిసోడ్‌ల సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం!
‘మేము కాప్‌లం’ కథేంటంటే?
మహాదేవపట్నం అనే ఊరికి గజపతి రాజు (నాగబాబు) పెద్ద దిక్కు. ఆయన చెప్పిందే వేదం, కోడి పందాలంటే ప్రాణమిచ్చే గజపతి రాజుకు ‘సలార్ రాజు’ అనే ఒక ఫేమస్ పందెం కోడి ఉంటుంది. ఊరి జనాలు కూడా దాన్ని ఒక సెలబ్రిటీలా చూస్తుంటారు. రాబోయే సంక్రాంతి పందాల కోసం సలార్ రాజును సిద్ధం చేసి, ఊరి జనాలందరికీ భారీ పార్టీ ఇస్తాడు గజపతి రాజు. అయితే, ఆ రాత్రే సలార్ రాజు మాయమవుతుంది.
తన ప్రతిష్టకు భంగం కలిగించిన ఈ కోడి దొంగతనం కేసును ఛేదించే బాధ్యతను ఊరి ఎస్ఐ రవి సొటారి (రవితేజ నన్నిమల), కానిస్టేబుల్ మోహన్ సొటారి (గెటప్ శీను)లకు అప్పగిస్తాడు. గజపతి రాజు ప్రత్యర్థులైన మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలపై పోలీసుల అనుమానం రేకెత్తుతుంది. ఈ కోడిని వెతికే క్రమంలోనే ఊళ్లో కొందరు రక్తం వాంతులు చేసుకోవడం, చేతబడుల ప్రచారం, అలాగే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా కోణాలు వెలుగులోకి వస్తాయి. అసలు సలార్ రాజును దొంగిలించింది ఎవరు? పోలీసులు ఊరిని ఎలా కాపాడారు? మధ్యలో సంఘవి (సిరి పార్వతి), ఆకాష్ రెడ్డి (చరణ్ లక్కరాజు)ల ప్రేమకథ ఏమైంది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఒక చిన్న పాయింట్‌ను తీసుకుని దానికి వినోదాన్ని, సస్పెన్స్‌ను జోడించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్‌ను మలిచారు. కోడి మిస్సింగ్ చుట్టూ తిరిగే తొలి రెండు ఎపిసోడ్‌లు మంచి కామెడీతో సాగి, ఆసక్తికరమైన ట్విస్ట్‌తో ముగుస్తాయి. ముఖ్యంగా రవి, మోహన్ అనే ఇద్దరు పోలీసులు తమ అతి తెలివితేటలతో వేసే ప్లాన్స్ బెడిసికొట్టే సీన్స్, కేసు ఇన్వెస్టిగేషన్ పేరుతో వారు చేసే హడావిడి నవ్వులు పూయిస్తుంది. కథలో కేవలం కోడి మిస్సింగ్ మాత్రమే కాకుండా, గంజాయి అక్రమ రవాణా వంటి సీరియస్ అంశాన్ని కూడా జోడించి సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో రచయిత శోభన్ సఫలమయ్యారు. చివరి ఎపిసోడ్‌లో పోలీసుల మధ్య వచ్చే ఎమోషన్స్ కూడా బాగా కుదిరాయి. అయితే, థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగున్నా, కొన్ని చోట్ల ల్యాగ్ స్పష్టంగా కనిపిస్తుంది. లవ్ స్టోరీ, ‘అబ్బా’ అనే టీమ్ ఎపిసోడ్‌లు కథకు కాస్త అడ్డుపడినట్లు అనిపిస్తునప్పటికీ, కోడిని ఎవరు దొంగిలించారనే క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉండి సిరీస్‌కు ప్లస్ అయ్యింది.
నటీనటుల విషయానికి వస్తే కామెడీ పోలీస్ పాత్రల్లో రవితేజ నన్నిమల, గెటప్ శ్రీను ఒదిగిపోయారు. వీరిద్దరి కెమిస్ట్రీ, టైమింగ్ సిరీస్‌కు ప్రధాన బలం. ఊరి పెద్దగా నాగబాబు తన హుందాతనాన్ని చాటుకున్నారు. సిరి పార్వతి క్యూట్‌గా కనిపించగా, లోకల్ టీవీ రిపోర్టర్ మీనాక్షిగా రీతూ చౌదరి, కిరీటి దామరాజు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికంగా చూస్తే.. కిషోర్ బోయిడపు సినిమాటోగ్రఫీ కోనసీమ అందాలను, విలేజ్ లొకేషన్లను ఎంతో సహజంగా చూపించింది. సాకేత్ కోమందూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్టుగా ఉంది. బి.వి.ఎస్. రవి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
ఫైనల్లీ: ‘మేము కాప్‌లం’ వీకెండ్‌లో సరదాగా టైమ్ పాస్ కోసం చూడదగ్గ ఒక ఫన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.