Reading Time: 2 minutes
Telangana Heatwave Five Deaths Sunstroke Safety Tips

Heatwave Alert in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా ఐదుగురు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో వేడి, ఉక్కబోత రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటువంటి వేడి శరీరానికి ప్రమాదకరమని చెప్తున్నారు నిపుణులు. ఇలాంటి ఎండలో ఎక్కువసేపు ఉంటే.. శరీర ఉష్ణోగ్రత పెరిగి.. డీహైడ్రేషన్, వడదెబ్బకు గురై.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వైద్యులు ఎండ, ఉక్కబోత విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వేడి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. వేడి, ఉక్కబోత వల్ల శరీరం నుంచి చెమట ద్వారా నీరు, ఎలక్ట్రోలైట్స్​ను కోల్పోతుంది. కాబట్టి దాహం వేసే వరకు వేచి చూడకండి. క్రమం తప్పకుండా నీరు తాగండి. ఓఆర్ఎస్, కొబ్బరి నీరు, నిమ్మరసం, తాజా పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరంలోని వేడిని చల్లబరిచి.. అవసరమైన ఖనిజాలను పొందేందుకు హెల్ప్ చేస్తాయి. టీ, కాఫీ, మద్యం, షుగర్ డ్రింక్స్​కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సూర్యరశ్మి అత్యంత తీవ్రంగా ఉంటుంది.

ఈ సమయంలో బయట తిరగడం మానుకోవాలి. తప్పనిసరి అయితే.. లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి వెళ్లండి. అలాగే సూర్యరశ్మి నేరుగా మీపై పడకుండా గొడుగు, టోపీ లేదా సన్ గ్లాసెస్ వంటివి ఉపయోగించాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో లేదా చల్లని ప్రదేశంలో ఉండండి. నేరుగా సూర్యరశ్మి పడకుండా కిటికీలకు తెరలు వేయండి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీని ఉపయోగించండి. ఇవి అందుబాటులో లేకపోతే.. చల్లటి నీటితో స్నానం చేయడం లేదా తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా శరీరాన్ని వేడి నుంచి కాపాడటానికి సహాయపడతాయి.