Reading Time: < 1 minute
Cockroach Janata Party X Account Withheld India Abhijit Dipke

Cockroach Janata Party: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పొలిటికల్ శటైరికల్ అకౌంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి గట్టి షాక్ తగిలింది. భారతీయ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ అకౌంట్‌ను భారత్‌లో ఎక్స్ (ట్విట్టర్) సంస్థ నిలిపివేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ అకౌంట్, ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. ఈ రేంజ్‌లో దూసుకుపోతూ, మంచి మొమెంటం అందుకుంటున్న సమయంలోనే ఈ అకౌంట్‌పై నిషేధం పడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తున్న పాప్-అప్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ, “మనం ముందే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో విత్‌హెల్డ్ చేశారు” అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఎక్స్‌లో `@CJP_2029` అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ఈ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే.. ‘అకౌంట్ విత్‌హెల్డ్’ అని బోల్డ్ అక్షరాలతో కనిపిస్తోంది. అంతేకాదు, ఒక చట్టపరమైన డిమాండ్ (లీగల్ డిమాండ్) కు స్పందనగా భారతదేశంలో ఈ అకౌంట్‌ను నిలిపివేసినట్లు అక్కడ స్పష్టంగా రాసి ఉంది.

అసలు ఈ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారనే విషయానికి వస్తే.. ఎక్స్ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా అధికారిక సంస్థ లేదా ప్రభుత్వం నుంచి సరైన చట్టపరమైన అభ్యర్థన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినా లేదా చట్టపరమైన ఆదేశాలు వచ్చినా.. ఆయా దేశాల పరిధి వరకు మాత్రమే సదరు కంటెంట్ లేదా అకౌంట్ కనిపించకుండా యాక్సెస్‌ను నిలిపివేస్తామని ఎక్స్ సంస్థ వివరించింది. చట్టపరమైన డిమాండ్ల వల్లే ఈ వ్యంగ్య పొలిటికల్ అకౌంట్‌పై ఇండియాలో ఈ విధమైన పరిమితి విధించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది.