Reading Time: 2 minutes
International Tea Day Is Your Daily Chai Healthy Nutritionists Explain

International Tea Day: భారతీయుల జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే మొదలయ్యే టీ అలవాటు నుంచి సాయంత్రం విశ్రాంతి సమయంలో తాగే కప్పు చాయ్ వరకు, టీ చాలా మందికి భావోద్వేగంతో కూడిన పానీయం. అయితే ప్రతిరోజూ తాగే ఈ చాయ్ నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నకు పోషకాహార నిపుణులు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం, టీ ఆరోగ్యకరమా కాదా అనేది దాన్ని ఎలా తయారు చేస్తున్నాం, ఎంత పరిమాణంలో తాగుతున్నాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

చాయ్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు
న్యూట్రిషన్ & డైటెటిక్స్ ప్రకారం, టీ ఆకుల్లో సహజసిద్ధంగా ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడవచ్చని చెబుతున్నారు.. టీ తయారీలో అల్లం, యాలకులు, దాల్చిన చెక్క వంటి మసాలాలు ఉపయోగిస్తే టీ మరింత ఆరోగ్యకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎక్కువ చక్కెరే ప్రధాన సమస్య
టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అందులో కలిపే పదార్థాలే దాని పోషక విలువను ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక పరిమాణంలో చక్కెర వేసుకుని రోజుకు అనేకసార్లు టీ తాగడం ఆరోగ్యానికి హానికరమవుతుంది. ఇలా ఎక్కువ చక్కెర కలిగిన టీ తాగడం వల్ల బరువు పెరగడం, మధుమేహం, ఇతర జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫుల్ ఫ్యాట్ పాలు అధికంగా ఉపయోగిస్తే శరీరంలో సాచురేటెడ్ ఫ్యాట్, కేలరీలు కూడా పెరిగే అవకాశం ఉంది.

టీ నిద్ర, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందా?
కాఫీతో పోలిస్తే టీ లో కేఫిన్ తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువగా తాగితే సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఎక్కువ టీ తాగితే నిద్రలేమి, అసిడిటీ, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఖాళీ కడుపుతో టీ తాగడం కంటే భోజనాల మధ్యలో తాగడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేస్తే అసిడిటీ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు.

టీకి బదులుగా నీరు తగ్గించకండి
చాలా మంది రోజంతా నీరు తాగే బదులు వరుసగా టీ తాగుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో ఇది డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టీతో పాటు తగినంత నీరు కూడా తాగడం అవసరం.

టీని ఆరోగ్యకరంగా మార్చే సులభమైన మార్గాలు
టీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, చిన్న చిన్న మార్పులతో దాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర పరిమాణాన్ని తగ్గించడం, స్కిమ్డ్ మిల్క్ ఉపయోగించడం, సహజ మసాలాలు కలపడం వల్ల టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చని, అయితే అది కూడా పరిమితంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, సరైన పరిమాణంలో, సరైన విధంగా తయారు చేసిన చాయ్ ఆరోగ్యకర జీవనశైలిలో భాగమవుతుందని నిపుణులు చెబుతున్నారు.