Reading Time: 2 minutes
Rohit Sharma Calls Ipl 2026 Mumbai Indians Worst Season After Kkr Defeat

Rohit Sharma Calls IPL 2026 Mumbai Indians’ Worst Season: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. కనీసం చివరి మ్యాచ్‌లలో విజయాలు సాధించి పట్టికలో పైకి ఎగబాకుతామనుకున్న ఎంఐకి షాక్‌లు తగులుతున్నాయి. బుధవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్లకు 147 పరుగులే చేయగా.. కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్ 2026లో ముంబై ఘోర ప్రదర్శనపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో జట్టు అన్ని విభాగాల్లో విఫలమైందని, చాలా అరుదుగా ఇలాంటి దారుణ పరిస్థితిని ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో చూసానని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. రోహిత్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఇది మాకు మరో నిరాశాజనకమైన సీజన్. ముంబై ఇండియన్స్‌కే కాదు.. వ్యక్తిగతంగా నాకు కూడా ఈ సీజన్ పేలవంగా సాగింది. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి పరిస్థితిని చాలా అరుదుగానే చూశాను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. మాకు ఏదీ సరిగ్గా జరగడం లేదు. ప్రతి విషయంలో తప్పిదాలు జరుగుతున్నాయి. అందుకే ముంబై చరిత్రలోనే ఇది చాలా చెత్త సీజన్‌గా నిలిచింది’ అని రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబై ఈ కష్టకాలం నుంచి త్వరగా బయటపడాలని హిట్‌మ్యాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ దశను ఎంత త్వరగా దాటిపోతామో అంత మంచిది. కనీసం చివరి మ్యాచ్ అయినా గెలిచి ఈ టోర్నీని సానుకూలంగా ముగించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. రోహిత్ మాటల్లో కనిపించిన నిరాశ ముంబై అభిమానులను మరింత కలచివేసింది. రోహిత్ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 160.79 స్ట్రైక్ రేట్, 40.42 సగటుతో 283 పరుగులు మాత్రమే చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్.. ఈసారి మాత్రం అంచనాలకు పూర్తిగా భిన్నమైన ప్రదర్శన ఇచ్చింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, బోల్ట్, డికాక్, దీపక్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు నిలకడైన ఆటతీరును కనబరచలేకపోయింది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ విఫలం కావడం, బౌలర్లు భారీ పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్‌లో తప్పిదాలు ముంబైని దెబ్బతీశాయి. ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ముంబై అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి రోహిత్ నోటి నుంచి ‘చెత్త సీజన్’ అనే మాట రావడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.