Reading Time: < 1 minute
Tg Bharath Files Criminal Defamation Case Against Byreddy Siddharth Reddy

TG Bharath vs Byreddy Siddharth Reddy: కర్నూలులో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి టీజీ భరత్‌ తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై క్రిమినల్ పరువునష్టం దావా కేసు వేశారు. ఈ విషయాన్ని మంత్రి టీజీ భరత్ స్వయంగా వెల్లడించారు. తనపై మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మంత్రి ఆరోపించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీయడం, తనపై ద్వేషభావం కలిగించడం లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో వివరించినట్లు సమాచారం.

ఇప్పటికే క్రిమినల్ పరువునష్టం దావా నమోదు చేసిన మంత్రి టీజీ భరత్, త్వరలోనే సివిల్ పరువునష్టం దావా కూడా వేస్తానని తెలిపారు. చట్టపరంగా పూర్తి స్థాయిలో పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం కర్నూలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్‌ బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలతో పాటు పలు అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. మంత్రి టీజీ భరత్ తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానిస్తున్నారని, “ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే తాను చెప్పిన వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పిస్తారని ఆరోపించారు. టీజీ వెంకటేష్‌ గౌరవం కోల్పోయారని, అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు బైరెడ్డి.. మీసాలు తిప్పుకుని తిరిగేవాళ్లు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎవరు వచ్చారో చెప్పాలి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించిన విషయం విదితమే..