July 12, 2026

Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
Reading Time: < 1 minute
Amazon Prime Video Mx Player Merger Details Here

అమెజాన్ ప్రైమ్ వీడియో తన వినియోగదారులకు ఒక తీపి కబురు అందించింది. గత రెండేళ్ల క్రితం ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)ను కొనుగోలు చేసిన అమెజాన్, ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా ప్రైమ్ వీడియోలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారతదేశంలోనే అతిపెద్ద కంటెంట్ లైబ్రరీ కలిగిన స్ట్రీమింగ్ సర్వీస్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో అవతరించనుంది. ఇకపై ఎంఎక్స్ ప్లేయర్‌లోని పాపులర్ షోలు (ఉదాహరణకు బాబీ డియోల్ నటించిన ‘ఆశ్రమ్’), ఒరిజినల్స్ అన్నీ కూడా ప్రైమ్ వీడియో యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాలు చూడొచ్చు. మెంబర్‌షిప్ లేని వారు ఎంఎక్స్ ప్లేయర్ కంటెంట్‌ను యాడ్స్‌తో ఉచితంగా చూసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ రెండు ఓటీటీలు కలవడం వల్ల భారతీయ ప్రేక్షకులకు దేశీ , అంతర్జాతీయ సినిమాలతో కూడిన ఒక భారీ వినోద ప్రపంచం అందుబాటులోకి వస్తుంది.

యాప్ వాడకంలో మార్పులు..
ఆండ్రాయిడ్ వాడుతున్న వారు ఎంఎక్స్ ప్లేయర్ యాప్‌ను అలాగే వాడుకోవచ్చు. కానీ అది కొత్త బ్రాండ్ పేరుతో, ప్రైమ్ వీడియో ఇంటర్‌ఫేస్‌తో కనిపిస్తుంది. అక్కడే మీకు కావాలంటే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఐఫోన్ వాడుతున్న వారు లేదా వెబ్ సైట్‌లో చూసే వారు నేరుగా ప్రైమ్ వీడియోకు మళ్లించబడతారు.

ఈ విలీనం గురించి అమెజాన్ ప్రతినిధి గౌరవ్ గాంధీ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా విభిన్న కథలను అందించడమే మా లక్ష్యం. ఎంఎక్స్ ప్లేయర్ కలయికతో ప్రైమ్ వీడియో ఇకపై ప్రతి ఒక్కరికీ వన్-స్టాప్ డెస్టినేషన్‌గా మారుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ప్రక్రియ పూర్తిగా పూర్తికానుంది.