July 14, 2026

Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
Reading Time: < 1 minute
Iran Us Talks Islamabad Peace Deal Nuclear Sanctions Ceasefire

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయా? మళ్లీ రెండు దేశాలు చర్చలు జరపనున్నారా? మరోసారి ఇస్లామాబాద్ వేదిక కాబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

ఇప్పటి వరకు ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా ఇరాన్ ముందు అమెరికా 14 సూత్రాల శాంతి ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనలను ఇరాన్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో రాబోయే 24-72 గంటల్లో పురోగతి సాధిస్తామని పాకిస్థాన్ అంటోంది. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఆంక్షల సడలింపు, అణ్వాయుధాల నియంత్రణ, కాల్పుల విరమణ పొడిగింపు వంటి అంశాలతో అమెరికా-ఇరాన్ చర్చలు ఒక ఒప్పందానికి చేరువవుతున్నాయని ఇస్లామాబాద్ చెబుతోంది.

అమెరికా-ఇరాన్ ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు దగ్గరగా ఉన్నాయని.. త్వరలో ఇస్లామాబాద్‌లో మరో విడత చర్చలు జరగనున్నాయని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలోని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతిపాదనలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించడం, ఘర్షణలకు విరామం ఇవ్వడం, అణు, ప్రాంతీయ భద్రతా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపడం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానాంశం ఏమిటంటే.. యురేనియం శుద్ధిని నిలిపివేయడం, బాలిస్టిక్ క్షిపణి విస్తరణను ఆపడం, ఐక్యరాజ్యసమితి తనిఖీలను అంగీకరించడం, భూగర్భ అణు కేంద్రాల వద్ద కార్యకలాపాలను పరిమితం చేయడం వంటి వాటికి ఇరాన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతించడం వంటివి టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.

పాకిస్థాన్, టర్కీ, రష్యా, చైనా, గల్ఫ్ దేశాలతో సహా పలు దేశాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి.. ఐదు నుంచి 14 సూత్రాల వరకు ఉన్న పలు ముసాయిదాలపై చర్చలు జరిపినట్లు పాకిస్తానీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలుకు హామీలు ఇవ్వడంలో చైనా, రష్యా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కూడా పాలుపంచుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి.