Reading Time: < 1 minute
Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..

కులమతాలన్నీ వేరైనా.. మేము భారతీయులమంతా ఒక్కటే అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఒక ముస్లిం సోదరుడు. హిందూ ముస్లింలు భాయి భాయి అంటూ తరతరాలుగా స్నేహభావంతో మెలిగే గొప్ప సంప్రదాయానికి ఆయన సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. తన సొంత స్థలంలో హిందూ దైవమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి, అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఖాదరబాదుకు చెందిన మహబూబ్ బాషా, తన కుటుంబానికి చెందిన సొంత స్థలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కేవలం గుడి కట్టించడమే కాకుండా స్వామివారి కల్యాణోత్సవాన్ని స్వయంగా దగ్గరుండి జరిపించారు. మహబూబ్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, భక్తిశ్రద్ధలతో వేడుకను నిర్వహించడం స్థానికులను ఎంతగానో ఆకర్షించింది.

వెల్లివిరిసిన సోదరభావం

ఈ అరుదైన వేడుకకు ఖాదరబాదులోని హిందూ, ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మతాలకు అతీతంగా అందరూ కలిసి స్వామివారిని దర్శించుకుని, ఆలయ నిర్మాణకర్తలను ఆశీర్వదించారు. ఈ దృశ్యం గ్రామమంతటా ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయానికి ధర్మకర్తలుగా సయ్యద్ మహబూబ్ బాషా, ఆయన కుటుంబీకులు సయ్యద్ మహబూబ్ వలి, ఇమాంబీ వ్యవహరిస్తుండటం విశేషం.

కడప జిల్లా – సామరస్యానికి చిరునామా

చాలామంది ముస్లింలు కేవలం అల్లాను మాత్రమే కొలుస్తారని భావిస్తుంటారు. కానీ కడప జిల్లాలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. దేవుని కడప దేవాలయంలో ఉగాది రోజున అందరికంటే ముందుగా పూజకు వచ్చేది ముస్లిం సోదరులే కావడం ఇక్కడి సంప్రదాయం. అదేవిధంగా ఇక్కడ ఉన్న హిందువులు పీర్ల పండుగలను, ఉరుసులను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగానే మహబూబ్ బాషా నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించడం జిల్లాలోని మత సామరస్యానికి మరో కలికితురాయిగా నిలిచింది.

వీడియో చూడండి..