Reading Time: 2 minutes
Veg Pulao Recipe Restaurant Style Easy Lunchbox Indian

Veg Pulao Recipe: ఇంట్లో మహిళలు ఉదయాన్నే లేచి పనులన్నీ చేస్తుంటారు. ఈ పనుల్లో అతి ముఖ్యమైనది, ప్రధానమైనది ఆఫీస్‌కు వెళ్లే భర్త లేదా స్కూల్‌కు వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయడం. ఏదో ఒక ఫుడ్ ఐటమ్ వండి పెడదామంటే ఇష్టంగా తింటారో లేదో అనే సందేహం వస్తుంది. అందుకే అలాంటి వాళ్ల కోసం ఓ మంచి రెసిపీని తీసుకొచ్చాం. రుచికరమైన వెజ్ పులావ్‌ను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
బియ్యం: 1 ½ కప్పుల బాస్మతీ బియ్యం (పాతవి అయితే మంచిది)
నూనె/నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు: బిర్యానీ ఆకు (1), షాజీరా (¾ స్పూన్), యాలకులు (4), లవంగాలు (4), దాల్చిన చెక్క (2 అంగుళాలు), అనాస పువ్వు (1), జాపత్రి, జాజికాయ పొడి (చిటికెడు), సోంపు పొడి (అర స్పూన్).
కూరగాయలు: ఉల్లిపాయ (1 పెద్దది), పచ్చిమిర్చి (2), క్యారెట్ (ముక్కలు – ¾ కప్పు), బీన్స్ (½ కప్పు), పచ్చి బఠానీలు (½ కప్పు), బంగాళదుంప (1 మీడియం).
ఇతరాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 ½ స్పూన్), పుదీనా లేదా కొత్తిమీర (3 టేబుల్ స్పూన్లు), ఉప్పు (తగినంత).
నీళ్లు: కుక్కర్‌కు 2 ½ కప్పులు, గిన్నెలో అయితే 2 ¾ కప్పులు, ఇన్‌స్టంట్ పాట్‌కు 1 ¾ కప్పులు.

తయారీ విధానం:

మొదట బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే కూరగాయలన్నింటినీ చిన్న ముక్కలుగా కోసి సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి, అందులో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక మసాలా దినుసులన్నీ (షాజీరా, యాలకులు, లవంగాలు మొదలైనవి) వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు (సుమారు నిమిషం పాటు) వేగనివ్వాలి. తర్వాత కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేయాలి. ఈ నీరు కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అన్నానికి ఉప్పు సరిగ్గా పడుతుంది. నీళ్లు బాగా మరిగిన తర్వాత, నానబెట్టి బియ్యాన్ని వేసి మెల్లగా కలపాలి. కుక్కర్‌లో అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. ప్రెజర్ అంతా పోయాక మూత తీసి స్పూన్‌తో మెల్లగా కలపాలి. గిన్నెలో అయితే మూత పెట్టి సన్నని మంట మీద నీళ్లన్నీ ఇంకిపోయి అన్నం ఉడికే వరకు ఉంచాలి. స్టవ్ ఆపేసిన తర్వాత 15 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది. అంతే టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పులావ్ రెడీ..