Reading Time: < 1 minute
Ms Dhoni Absence Csk 2026 Season Michael Hussey Reason

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ధోనీ (MS Dhoni) మైదానంతో సంబంధం లేకుండా తన ఆట తీరు, వ్యక్తిత్వంతో కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక 2026 సీజన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ డగౌట్‌లోనూ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించకపోవడం అభిమానుల్లో ఎన్నో అనుమానాలకు, చర్చలకు దారితీసింది. ఈ మిస్టరీని ఛేదిస్తూ సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు మాట్లాడిన హస్సీ.. ధోనీ మైదానానికి దూరంగా ఉండటం వెనుక ఉన్నది అహంకారం కాదు, జట్టు పట్ల ఆయనకున్న నిస్వార్థ ప్రేమేనని స్పష్టం చేశారు.

ధోనీ డగౌట్‌లో ఉంటే కెమెరాలన్నీ ఆయన వైపే ఉంటాయని, స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో హోరెత్తిపోతుందని, దీనివల్ల ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని ‘మిస్టర్ కూల్’ భావిస్తున్నారట. జట్టు ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉండాలని, తన వల్ల ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే మ్యాచ్ రోజున స్టేడియానికి రావడం లేదని హస్సీ వివరించారు. ధోనీ ఆలోచన సరైనదా కాదా అన్నది పక్కన పెడితే, టీమ్ ప్రయోజనాలే ముఖ్యమని భావించే వ్యక్తిత్వానికి ఇది నిదర్శనమని కోచ్ కొనియాడారు.

ప్రస్తుతం ధోనీ ఒకవైపు పిక్క గాయం (Calf Injury) నుంచి కోలుకుంటూనే, మరోవైపు నెట్స్‌లో ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటూ తన అనుభవాన్ని కుర్రాళ్లతో పంచుకుంటున్నారు. ఇక ధోనీ ఎప్పుడు బరిలోకి దిగుతారన్న ప్రశ్నకు కోచ్ స్పందిస్తూ.. ఆయన రన్నింగ్ వేగం పుంజుకుందని, బ్యాటింగ్, వికెట్ కీపింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని హస్సీ ధీమా వ్యక్తం చేశారు. తన గాయం పూర్తిగా నయమైందని ధోనీకి నమ్మకం కలిగిన వెంటనే, బహుశా తదుపరి మ్యాచ్‌లలోనే ఆయన మళ్లీ పసుపు రంగు జెర్సీలో మైదానంలో మెరిసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.