Reading Time: 2 minutes
Axar Patel On Dc Win Now I Know Why Starc Is A Legend Ipl 2026 Rr Vs Dc

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అద్భుత విజయాన్ని అందుకుంది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా రాజస్థాన్‌ 225 రన్స్ చేయగా.. లక్షాన్ని ఢిల్లీ మరో ఐదు బంతులు ఉండగానే 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ డీసీ అద్భుత విజయంపై స్పందిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ప్రతి రోజు ఒకే విధమైన ప్రదర్శనను కొనసాగిస్తే పరిస్థితులను మార్చుకోవచ్చని తాను ముందే చెప్పానని గుర్తుచేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ జట్టు అద్భుతంగా రాణించిందన్నాడు. ప్లాన్‌ను సరిగ్గా అమలు చేయడంతో విజయం సాధించగలిగామని తెలిపాడు. కెప్టెన్‌గా ఇలాంటి ప్రదర్శన చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని అక్షర్ పేర్కొన్నాడు.

‘నిజానికి గత మ్యాచ్ తర్వాత కూడా నేను ఇదే చెప్పాను.. ప్రతి రోజూ వచ్చి మన పనిని చేస్తూ ఉండాలి. అప్పుడు పరిస్థితులను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ రోజు మా ఆటగాళ్లు ఆడిన విధానం చూసి చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుతంగా రాణించారు. మేము ప్లాన్‌లను సరైన రీతిలో అమలు చేశాం, అందుకే ఫలితం కూడా మాకు అనుకూలంగా వచ్చింది. కెప్టెన్‌గా ఇంతకంటే సంతోషం ఉండదు. ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను మలుపుతిప్పగల ముఖ్యమైన బ్యాటర్లను పవర్‌ప్లేలోనే ఔట్ చేయగలిగితే.. ఆ ఆనందం వేరేగా ఉంటుంది. స్టార్క్ తిరిగి రావడం మాకు కలిసొచ్చింది. ఈ రోజు అతను బౌలింగ్ చేసిన తీరు చూస్తే.. అతడు ఎందుకు లెజెండ్ అన్నది అర్థమవుతుంది. మూడు నెలల విరామం తర్వాత వచ్చి.. ఇలాంటి పిచ్‌పై ఇంత గొప్ప ప్రదర్శన ఇవ్వడం అతని స్థాయిని చూపిస్తుంది. స్టార్క్ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. అతను ఎంత గొప్ప బౌలర్’ అని అక్షర్ చెప్పాడు.

‘నేను భారత జట్టులో ఉన్నప్పుడు కూడా కెప్టెన్సీ చేశాను. అది చాలా ఉపయోగపడింది. ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు, భారత ఆటగాళ్లను సమన్వయం చేయాలి. అదే సమయంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయంలో నేను మెరుగయ్యాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఆలోచించను. నా అభిప్రాయాలను నమ్మి ముందుకు వెళ్తాను. కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ కూడా సహాయం చేస్తున్నారు. ఫలితాలు చూస్తే మనం సరైన దిశలో ఉన్నామని తెలుస్తోంది. మనపై మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. నా చేతి ఇప్పుడు బాగానే ఉంది. ఫిజియో ఐస్ పెట్టాడు. గత మ్యాచ్ తర్వాత మా అభిమానులకు సంబంధించిన విషాద ఘటనపై నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ నష్టానికి చింతిస్తున్నాను. ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాం. మా ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులను మేము కోల్పోయాం’ అని అక్షర్ చెప్పుకొచ్చాడు.