Reading Time: 2 minutes
Us Iran Talks Islamabad Lockdown Security Pakistan Preparations

US-Iran Talks: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం మరోసారి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సిద్ధమవుతోంది. సోమవారం నుంచి రెండు దేశాల మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ చర్చలకు పాకిస్తాన్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పాకిస్తాన్ జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండిలో భారీగా భద్రతను మోహరించింది. నగరం అంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ పరిస్థితి ఏర్పడింది. చర్చల తేదీలపై ఇంకా స్పష్టత రానప్పటికీ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజా, సరకు రవాణాపై భారీ ఆంక్షలు విధించింది. అయితే, చర్చలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని పాకిస్తాన్ వర్గాలు చెబుతుంటే, ఇంకా తేదీ ఖరారు కాలేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్‌‌జాదే శనివారం చెప్పారు. ట్రంప్ ఆదివారం మాట్లాడుతూ.. తమ ప్రతినిధులు సోమవారం ఇస్లామాబాద్ చేరుకుంటారని అన్నారు.

Read Also: Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత

ఇదిలా ఉంటే, ఈ చర్చల కోసం పాకిస్తాన్ భారీ ఏర్పాట్లు చేసింది. చర్చల వేదిక సెరీనా హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇస్లామాబాద్ వ్యాప్తంగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫోటోలు, చర్చలకు సంబంధించిన హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం ఊసే కనిపించడం లేదు. ఇస్లామాబాద్ లోని సున్నితమైన ప్రాంతాల్లో రాకపోకలపై నియంత్రణ కొనసాగుతోంది. ఇస్లామాబాద్‌ను పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాలతో కలిపే కీలక బస్ టెర్మినల్ అయిన ఫైజాబాద్‌ను శనివారం రాత్రి నుంచే మూసేశారు. అన్ని ప్యాసింజర్ బస్సులు, ప్రజా రవాణాపై నిషేధం విధించారు. మోటార్ వే, గ్రాండ్ ట్రంక్ రోడ్, ఇంటర్ సిటీ సర్వీసుల్ని పరిమితం చేశారు. రెంటెడ్ కార్ సర్వీస్, పర్యాటక బస్సుల్ని నిలిపేశారు.

దేశవ్యాప్తంగా రవాణా సంస్థలకు ఇస్లామాబాద్‌కు టికెట్లు జారీ చేయవద్దని ఆదేశాలు అందాయి. 6000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని, 900 మంది ఫెడరల్ పోలీస్ సిబ్బందిని మోహరించారు. వీరితో పాటు పాక్ రేంజర్లు, సైనికులు అదనం. రావల్పిండిలో 5000 మందికి పైగా అధికారుల్ని మోహరించారు. ప్రతినిధులు దిగే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో సహా కీలక ప్రాంతా్లలో 350పైగా ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. మార్కెట్లు, దుకాణాలు, హోటళ్లు, విద్యాసంస్థలకు మూసేయాలని ఆదేశాలు అందాయి. చర్చలు జరుగుతాయో లేదో అనే సందేహాల నడుమ పాక్ మాత్రం మొత్తం రాజధానిని నిశ్శబ్ధం చేసింది.