Reading Time: 2 minutes
Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

నటుడు, జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ తన కెరీర్ ఆరంభ కష్టాలను, సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా నటుడు శ్రీనివాస్ రెడ్డితో ముడిపడిన ఒక సంఘటన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పరిశ్రమకు వచ్చినప్పుడు తనకు కన్నీటి గాథలు తక్కువేనని, పరిస్థితులను చూసి భయపడటం తప్ప ఎక్కువగా కష్టాలను ఎదుర్కోలేదని తెలిపారు. తాను పనిచేసినవారంతా లైక్ చేసేవారని, ఎంకరేజ్ చేసేవారని పేర్కొన్నారు. అయితే, సినీరంగ ప్రవేశానికి ముందు రాఘవ తండ్రి ఆయనను టీచర్ ట్రైనింగ్ పూర్తయినందున ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరమని సలహా ఇచ్చారు. దీనికి రాఘవ ఆరు నెలల సమయం కోరి, పరిశ్రమలో ప్రయత్నించి, అవకాశం రాకపోతే తిరిగి వచ్చేస్తానని తండ్రిని ఒప్పించారు. ఈ కమిట్‌మెంట్‌తోనే తండ్రితో ధైర్యంగా మాట్లాడానని, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన తండ్రి నెలకు భోజనం కోసం మెస్ కార్డు పంపేవారని గుర్తుచేసుకున్నారు.

ప్రారంభ రోజుల్లో సీరియల్ ఆర్టిస్ట్ శ్రీరామ్ తనకు ఎంతగానో అండగా నిలిచారని రాఘవ భావోద్వేగంగా తెలిపారు. రూమ్ రెంట్ పంచుకోవడం వంటివి కాకుండా, శ్రీరామ్ చాలా బిజీగా ఉండి కూడా తనకు తిరిగి డబ్బులిచ్చేవారని, అవకాశాల కోసం తనతోపాటు షూటింగ్‌లకు తీసుకెళ్లి డైరెక్టర్లకు పరిచయం చేసేవారని, జేబులో రెండు వందల రూపాయలు పెట్టి ఎంజాయ్ చేయమని పంపేవారని చెప్పారు. శ్రీరామ్ మద్రాస్‌కు షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఒంటరిగా ఉన్న సందర్భంలో అధిక జ్వరం వచ్చి, పిచ్చివాడైపోతానని భయపడిన రోజులను కూడా పంచుకున్నారు.

ఓ దశలో కేవలం భోజనం కోసమే షూటింగ్‌లకు వెళ్లిన అనుభవాన్ని వివరించారు. చిత్రపురి కాలనీ కొండల్లో జరిగిన ఒక సీరియల్ షూటింగ్‌లో తాను కానిస్టేబుల్ వేషంలో, ఖైదీల పక్కన నిలబడి రాళ్లు కొడుతూ కనిపించానని, స్క్రీన్‌పై తన ఉనికి అసలు కనిపించదని, అది జూనియర్ ఆర్టిస్ట్ వేషమని ఆ రోజు హర్ట్ అయినట్లు పేర్కొన్నారు. డైలాగులు చెప్పగలనని, ఈ వేషం జూనియర్లు చేయదగిందని చెప్పి, డైరెక్టర్‌ను అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

ఆ తర్వాత జెమినీ టీవీలో యాంకరింగ్ అవకాశం లభించిందని.. అప్పటికే నటుడు శ్రీనివాస్ రెడ్డి నవ్వు నవ్వించు అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారని గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి చివరి ఎపిసోడ్‌కు, రాఘవ మొదటి ఎపిసోడ్‌కు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి తనను ప్రోత్సహించారని, “నాకు వచ్చిన మంచి పేరు నీకూ రావాలి, మంచి లైఫ్ ఉండాలి” అని ఆశీర్వదించి షేక్‌హ్యాండ్ ఇచ్చారని రాఘవ తెలిపారు. శ్రీనివాస్ రెడ్డితో తన బంధం బాగుండేదని, ఆయన్ని అన్నయ్య అని పిలిచేవాడినని చెప్పారు.

అయితే, నవ్వుల సవాల్ అనే మరో కార్యక్రమం విషయంలో అనుకోకుండా ఒక “పొరపాటు” జరిగిందని రాఘవ వివరించారు. శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఆ ప్రోగ్రామ్‌ను తనకు తెలియకుండానే తాను చేసినట్లు చెప్పారు. “రాఘవ, ఆ ప్రోగ్రామ్ నీకు ఎవరు ఇచ్చారు?” అని శ్రీనివాస్ రెడ్డి అడిగినప్పుడు, “వారు పిలిచారు” అని చెప్పగా, “నేను చేసేవాడిని కదా, వారు నాకు చెప్పనే లేదు. కనీసం షూటింగ్ లేదు అని గానీ, యాంకర్‌ను మార్చామని గానీ చెప్పలేదు. నువ్వు నాకన్నా చెప్పాలి కదా” అని శ్రీనివాస్ రెడ్డి అడిగారని తెలిపారు. తనకు అప్పటికి అంత వైడ్ థింకింగ్ లేదని, పొరపాటు జరిగిపోయిందని రాఘవ వివరించారు. ఈ సంఘటన జరిగి చాలా కాలమైనప్పటికీ, శ్రీనివాస్ రెడ్డి పేరు తలుచుకున్నప్పుడల్లా తనకు ఆ అపరాధ భావన గుర్తొస్తుందని, “దాన్ని చెరుపుకోలేని తప్పు” అది అని పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డి అలాంటి విషయాలను పట్టించుకునే మనిషి కాదని, ఎప్పుడూ ఒకేలా ఉంటారని, అయినా తనలో మాత్రం ఆ గిల్టీ ఫీలింగ్ మిగిలిపోయిందని రాఘవ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..