Reading Time: < 1 minute
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎలా ఉన్నారు..? ఎక్కడ ఉన్నారు..?

అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడితో ఇరాన్ రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28న అమెరికాతో యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే, అప్పటి సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, అదే సమయంలో జరిగిన దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, మొజ్తబా ఖమేనీ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నప్పటికీ, ఆయన శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒక కాలికి మూడు సార్లు శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సమాచారం ప్రకారం, ఆయనకు కృత్రిమ కాలు అమర్చినట్లు తెలుస్తోంది. ఆయన చేతుల్లో ఒకదానికి కూడా సర్జరీ జరిగింది, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అతని ముఖం, పెదవులపై తీవ్రమైన కాలిన గాయాలు ఉండటం వల్ల ఆయన మాట్లాడటం కష్టతరంగా మారింది. త్వరలోనే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించనున్నట్లు సమాచారం.

మొజ్తబా ఆరోగ్యంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు. ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాలకు ఆయన ఆచూకీ తెలిసిపోతుందనే భయంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ను కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) సీనియర్ కమాండర్లు కూడా ఆయన్ను సందర్శించడం లేదు. కేవలం అధ్యక్షుడు, ఆరోగ్య మంత్రి మాత్రమే ఆయన సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం ఎవరితోనూ నేరుగా మాట్లాడటం లేదు. విశ్వసనీయ దూతల ద్వారా కేవలం రాతపూర్వక సందేశాలతోనే దేశ పాలన సాగిస్తున్నారని తెలుస్తోంది.

తొలి ప్రసంగంలోనే బలహీనంగా కనిపిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో, ఆయన కెమెరాల ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. శారీరక గాయాలు ఉన్నప్పటికీ, ఆయన మానసికంగా చాలా చురుకుగా ఉన్నారని, కీలక నిర్ణయాలను స్వయంగా తీసుకుంటున్నారని సమాచారం. ఇరాన్ చరిత్రలో అత్యంత క్లిష్ట సమయాల్లో మొజ్తబా నాయకత్వం వహిస్తుండటంతో, ప్రపంచ దేశాలన్నీ ఆయన తదుపరి అడుగుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…