
- ఏసీబీ అధికారులతో భేటీ
- కేసు వివరాలు తెలుసుకుంటున్న విజిలెన్స్ డీజీ శిఖాగోయల్
- ఏసీబీ, ఈడీ, కాగ్ నివేదిక ఆధారంగా విచారణ
- రూ.700 కోట్లు గోల్‌మాల్ జరిగినట్లు
- ఏసీబీ ప్రాథమిక నిర్ధారణ
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో నిధుల గోల్‌మాల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్కామ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ మేరకు విజిలెన్స్ డీజీ శిఖాగోయల్ ఇటీవల ఏసీబీ డీఎస్పీ సహా కేసు దర్యాప్తు చేసిన అధికారులతో సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్,వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో నిధుల గోల్‌మాల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్కామ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ మేరకు విజిలెన్స్ డీజీ శిఖాగోయల్ ఇటీవల ఏసీబీ డీఎస్పీ సహా కేసు దర్యాప్తు చేసిన అధికారులతో సమావేశం నిర్వహించారు.
పశుసంవర్ధక శాఖ రికార్డులతో పాటు ఏసీబీ సీజ్ చేసిన డాక్యుమెంట్లు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. దర్యాప్తు అనంతరం గొర్రెల పంపిణీ పేరిట ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్‌కు సంబంధించి ఏపీ పల్నాడు జిల్లాకు చెందిన రైతులకు చేరాల్సిన రూ.2.10 కోట్లు కాంట్రాక్టర్, పశుంవర్థకశాఖ అధికారులు కలిసి కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నిధుల దారిమళ్లింపు, ప్రభుత్వ నష్టానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేసింది.
రూ. 700 కోట్లు గోల్‌మాల్ గుర్తించిన ఏసీబీ..
గొర్రెపిల్లలను విక్రయించిన బాధితుల ఫిర్యాదు మేరకు 2023 డిసెంబర్‌లో గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైంది.ఈ కేసు ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దాదాపు 4.25 లక్షల గొర్రెల యూనిట్ల కొనుగోలు చేసేందుకు సుమారు రూ.4వేల కోట్లు మంజూరు చేసినట్లు గుర్తించింది. కాగా, ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓస్డీగా పనిచేసిన కల్యాణ్‌కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్ల పాత్ర బయటపడింది. ఈ స్కామ్‌పై దర్యాప్తు చేసిన ఏసీబీ.. సుమారు రూ.700 కోట్ల నిధులు కొల్లగొట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కోణంలో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. 2021 మార్చి నాటికి కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వివరాలను సేకరించింది.
కాగ్ నివేదిక, ఈడీ దర్యాప్తులో రూ.వెయ్యి కోట్లు
తెలంగాణలోని 7 జిల్లాల్లో రూ. 253.93 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించగా.. నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీసింది. 33 జిల్లాలకు సంబంధించి రూ. 1000 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు దారిమళ్లినట్లు గుర్తించింది.
గొర్రెల సరఫరా పేరుతో ప్రభుత్వ, ప్రయివేటు వ్యక్తులు/సంస్థల ఖాతాల్లో భారీగా నిధులు మళ్లించబడినట్లు ఆధారాలు సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ -ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగులు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలు గుర్తించింది.
200లకు పైగా మ్యూల్/డమ్మీ బ్యాంక్ అకౌంట్ల ద్వార ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు జరిగిన లావాదేవీల లింకులను ఈడీ సేకరించింది. ఈ పూర్తి ఆధారాలతో విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి అందించనున్నారు.