
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ జంటగా నటించిన చిత్రం హక్. 45 ఏళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన షా బానో కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ హక్ సినిమా ఇస్లాం మత విధానం, వారి ఆచారా వ్యవహరాలు వంటి అంశాలతో నిండి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హక్ సినిమా దర్శకుడు సుపర్న్ ఎస్ వర్మ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్‌లో భాగంగా రియాలిటీని తెలుసుకునేందుకు తమ టీమ్ ఎంతగానో శ్రమించిందని ఆయన పేర్కొన్నారు. ‘ఇస్లామిక్ చట్టాలు వారి ఆచార వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి మాకు సుమారు ఏడాదిన్నర సమయం పట్టింది. షాబోనో పాత్రలో యామీ గౌతమ్ జీవించేశారు. ఆమె తన పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మత గ్రంథాలను అధ్యయనం చేసింది. అలాగే తన పాత్రలో వాస్తవికత కనిపించేందుకు చాలా రీసెర్చ్ చేసింది. ఇందుకోసం పవిత్ర ఖురాన్‌ను కూడా యామీ నేర్చుకుంది. ఏదేమైనా మా మూవీతో యామీ గౌతమ్‌కు మంచి గుర్తింపు దక్కింది’ అని సుపర్న్ ఎస్ వర్మ పేర్కొన్నారు.
కాగా యామీ గౌతమ్ ధురంధర్ సినిమాల దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి అన్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ఉరి సినిమా షూటింగ్ లో ప్రేమలో పడిన వీరిద్దరు ఆ తర్వాత పెద్దల అనుమతిలో పెళ్లిపీటలెక్కారు. ఇక హక్ సినిమా విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన షా బానో(62)కు, తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చాడు. కేవలం ‘త్రిబుల్ తలాక్’ అనే ఒకే ఒక్క పదంతో తమ 40 ఏళ్ల బంధం తెగిపోయిందని ప్రకటించాడు. అయితే పిల్లల పోషణ బాధ్యతను పట్టించుకోకపోవడంతో 125 సీఆర్పీసీ కింద కోర్టులో పిటిషన్ వేసింది షాబానో. సుమారు పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంలో షా బానో కేసు గెలిచింది.
యామీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోస్..
కాగా నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ తదితర తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది యామీ గౌతమ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.