
- తక్కువ ధర టీ పొడికి సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్న ముఠా
- 10 మంది అరెస్ట్, 1,500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం
- కృత్రిమ రంగులు స్వాధీనం
అబిడ్స్, వెలుగు: నాసిరకం టీ పొడికి హానికరమైన సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్ఫాస్ట్) అరెస్ట్ చేసింది. సిటీలో భారీ ఎత్తున టీ పొడి కల్తీ జరుగుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో హెచ్ఫాస్ట్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 4 టన్నుల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకుంది. గురువారం బేగంబజార్‌లోని హెచ్ఫాస్ట్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఈ అక్రమ దందా వివరాలను మీడియాకు వెల్లడించారు.
కొంపల్లికి చెందిన పరేశ్ రాజన్ (రంగుల సరఫరాదారు), పెట్లబుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి (రంగులు కలిపే వ్యక్తి), ముషీరాబాద్‌కు చెందిన సతీశ్, బోయిన్ పల్లికి చెందిన నవీన్, ఆసిఫ్ నగర్ కు చెందిన నరసింహ (ఇల్లీగల్ ప్యాకెట్ల తయారీదారు), రాజేంద్రనగర్ కు చెందిన చున్నిలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, పెట్లబుర్జుకు చెందిన రాజేశ్, బీదర్‌కు చెందిన రవీందర్, మల్లేపల్లికి చెందిన వసీం.. కోల్‌కతా, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల నుంచి కిలో కేవలం రూ.150కే దొరికే నాసిరకం టీ పొడిని సేకరిస్తున్నారు.
దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి రసాయనాలతో పాటు బెల్లం పాకం, వాడేసిన టీ పొడిని కలుపుతున్నారు. ఇలా తయారైన కల్తీ మిశ్రమాన్ని ప్రముఖ బ్రాండ్ల ప్యాకెట్లలో నింపి కిలో రూ.250కి మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ పొడిని రోడ్డు పక్కన ఉన్న టీ స్టాళ్లతోపాటు కొన్ని ఉడిపి హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
గురువారం జరిపిన దాడుల్లో వీరి వద్ద నుంచి 3 వేల కిలోల కల్తీ టీ పొడి, 1,500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం, భారీగా కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకుకొని వారందరినీ అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపారు.
కల్తీని గుర్తించండిలా..
ఇలాంటి కల్తీ పొడితో తయారుచేసిన టీని తాగడం వల్ల కిడ్నీ, లివర్ వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని డీసీపీ హెచ్చరించారు. ఈ సందర్భంగా అసలుకు, నకిలీకి మధ్య తేడాను డెమో ద్వారా చూపారు. చల్లని నీటిలో టీ పొడి వేసినప్పుడు.. వెంటనే రంగు మారితే అది కల్తీ అని, రంగు మారడానికి సమయం పడితేనే అది స్వచ్ఛమైనదని వివరించారు. ఈ రైడ్ లో హెచ్ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నట్టు డీసీపీ వెల్లడించారు.