Reading Time: 2 minutes
Tamil Nadu West Bengal Elections 2026 11am Voter Turnout High

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోటాపోటీగా పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్ జాతర నడుస్తోంది. ఓటర్లు తండోపతండాలుగా తరలిస్తున్నారు. పోలింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటలకు తమిళనాడులో 37.56 శాతం పోలింగ్ నమోదు కాగా.. బెంగాల్ మొదటి దశలో 41.11 శాతం ఓటింగ్ నమోదైంది. ఇరు రాష్ట్రాల్లో భారీ పోలింగ్ నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీవీకే అధినేత విజయ్ కోరారు.

బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈరోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Ta23

ఓటేసిన ప్రముఖులు
సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో ఓటు వేశారు. విజయ్ తెల్ల చొక్కా, దానికి సరిపోయే తెల్ల ప్యాంటు ధరించి పోలింగ్ బూత్‌కు వచ్చారు. విజయ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ చెన్నైలోని ఆల్వార్‌పేట్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువాన్మియూర్‌లో నటుడు అజిత్ కుమార్ ఓటు వేశారు.