
Ragi Papad Recipe: రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, ప్రొటీన్, పీచు పదార్థాల (Fiber) శరీరానికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇవి ఎముకల బలానికి, రక్తహీనత నివారణకు, బరువు నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి గ్లూటెన్-రహిత (Gluten-free) ధాన్యాలు, డయాబెటిస్, గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని శరీర కణజాలాల మరమ్మత్తు, పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగిన రాగులతో క్రిస్పీ రాగి పాపడాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 2 కప్పులు
నీళ్లు: 1 కప్పు
జీలకర్ర: 1 చెంచా
నూనె: 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
తయారీ దశలు:
ముందుగా ఒక కడాయిలో ఒక కప్పు నీటిని తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర వేసి బాగా మరిగించాలి. మీకు నచ్చితే ఇందులో మరిన్ని మసాలాలు కూడా వేసుకోవచ్చు. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆపివేసి, అందులో 2 కప్పుల రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమంపై మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా (లోయలు) చేసుకోవాలి. ఒక బట్టర్ పేపర్ తీసుకుని దానిపై ఈ ఉండను పెట్టి పలుచగా గుండ్రంగా వత్తాలి. పాపడాలు మరీ లావుగా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఇలా తయారు చేసుకున్న పాపడాలను ఒక రోజంతా ఎండలో గానీ లేదా ఫ్యాన్ గాలి కింద గానీ బాగా ఆరనివ్వాలి. ఇక వాటి తీసుకుని, కడాయిలో నూనె వేడి చేసి, మధ్యస్థ మంట మీద వేయించుకోవాలి. ఇక కరకరలాడే, ఆరోగ్యకరమైన పాపడాలు రెడీ..