Reading Time: < 1 minute

సచివాలయంలో మంత్రులతో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ

Caption of Image.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీతో రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సీఎస్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. 

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు మొత్తం 32 సమస్యలు లేవనెత్తగా ఇందులో 29 అంశాలకు సర్కార్ సానుకూలంగా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్సీ (PRC) అమలు, కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికల వంటి మూడు అంశాలపై ఆర్టీసీ జేఏసీ నేతలు, మంత్రుల సబ్ కమిటీ డిస్కస్ చేస్తోంది. 

►ALSO READ | డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీతో కొలిక్కి వచ్చిన పోలీసుల మంతనాలు

మంత్రుల కంటే ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు ఐఏఎస్ అధికారుల బృందంతో భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో ఐఏఎస్  సీనియర్ అధికారుల కమిటీతో రెండో దఫా చర్చలు జరిపారు. అధికారుల కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ఆర్టీసీ ఎం.డి నాగి రెడ్డి ఉన్నారు. 

అపరిష్కృతంగా ఉన్న తమ మూడు ప్రధాన డిమాండ్లను ఆర్టీసీ జేఏసీ నేతలు లేవనెత్తినట్లు సమాచారం. దాదాపు ఈ భేటీ మూడు గంటల పాటు జరిగింది. లంచ్ అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మంత్రుల సబ్ కమిటీతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. మంత్రులతో భేటీ అనంతరం ఆర్టీసీ సమ్మెపై ఒక క్లారిటీ రానుంది. 

©️ VIL Media Pvt Ltd.