Reading Time: 2 minutes
వేద పాఠశాలలో విగతజీవిగా 11ఏళ్ల బాలుడు.. పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే వాస్తవాలు..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ ప్రాంతంలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. గురుకులానికి వెళ్తున్న 11 ఏళ్ల దివ్యాంశ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. బాలుడి శరీరంపై 42 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అతని వీపు, చేతులు, కాళ్లు, ఛాతీపై లోతైన కమిలిన గాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, అతని శరీరంపై 11 సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

దివ్యాంశ్‌ను అతని కుటుంబం ఏప్రిల్ 15న లక్నోలోని ఆలంనగర్‌లో ఉన్న రామానుజ భాగవత్ వేద విద్యాపీఠ్ గురుకులంలో చేర్పించింది. దివ్యాంశ్ మేనమామ అయిన సౌరభ్ మిశ్రా అలియాస్ కన్హయ్య ఆ పాఠశాలను నడుపుతున్నాడు. తాము నమ్మిన వ్యక్తే తమ బిడ్డ మృత్యువుకు కారణమవుతాడని ఆ కుటుంబం ఏమాత్రం ఊహ లేదు. నిందితుడు గత మంగళవారం ఈ నేరానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు.

పోలీసుల విచారణలో గురుకుల నిర్వాహకుడు బాలుడిపై దారుణంగా దాడి చేసినట్లు వెల్లడైంది. దివ్యాంశ్‌ను గంటల తరబడి ఎండలో నిలబెట్టి, రాత్రంతా చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు, కర్రలతో కొట్టినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. ఒక బలమైన తన్నుకు బాలుడు గోడకు తగిలి స్పృహ కోల్పోయాడు. అతన్ని అక్కడే వదిలేసి, మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చి చూడగా, చనిపోయి ఉన్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత అతని అనారోగ్యం గురించి ఆ కుటుంబానికి తెలియజేశాడు.

పోస్ట్‌మార్టంలో అతడిని బరువైన వస్తువుతో పదేపదే కొట్టడం వల్ల అంతర్గత గాయాలైనట్లు వెల్లడైంది. అత్యాచారం జరిగిందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో, పరీక్షల కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపారు. ఈలోగా, దివ్యాంశ్ గురుకుల నియమాలను పాటించలేదని, ఇతర విద్యార్థులు కూడా అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించారని గురుకుల డైరెక్టర్ సౌరభ్ పోలీసులకు తెలిపారు. అతను తరగతిలో సరిగ్గా చదువుకోలేదు. ఈ ఘటనను దాచిపెట్టడానికి నిందితుడు కుట్ర కూడా పన్నాడు. గురుకుల సీసీటీవీ ఫుటేజీని తొలగించడంలో అతని సన్నిహిత స్నేహితురాలు ప్రియాంక ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ మహిళ నిందితుడి ప్రియురాలు అని పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో చర్యలు తీసుకుంటూ, ప్రధాన నిందితుడు సౌరభ్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాల్లోనూ కఠిన న్యాయ చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరణించిన బాలుడు తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. కాగా, కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్‌లోని గౌరయ్యా గ్రామానికి చెందిన నరేంద్ర కుమార్, తన ఏకైక కుమారుడిని ఏప్రిల్ 15న లక్నోలోని తన మేనమామ గురుకులంలో చేర్పించినట్లు తెలిపారు. తన మేనమామ కంసుడు అవుతాడని ఏమాత్రం ఊహించలేకపోయానని ఆయన అన్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..