Reading Time: < 1 minute
Should You Stop Sip During Market Fall Investment Tips

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తరచుగా మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమైనప్పుడు, తాము చేస్తున్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లను ఆపేయాలని లేదా కొంతకాలం వాయిదా వేయాలని ఆలోచిస్తారు. అయితే.. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే భారీ లాభాలను వారు కోల్పోయే అవకాశం ఉంది. మార్కెట్ పతనం అనేది భయం కలిగించే అంశం కాదని.. నిజానికి అది తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకులను ఎలా తట్టుకోవాలో అర్థం చేసుకోవడం ముఖ్యం.

SIP యొక్క ప్రధాన బలం మార్కెట్ పడిపోయినప్పుడు కనిపిస్తుంది. మార్కెట్ పతనమైనప్పుడు మీ పెట్టుబడి విలువ తగ్గినట్లు అనిపించినా, అదే మొత్తంతో మీకు ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కేటాయించబడతాయి. దీనినే ‘రూపీ కాస్ట్ యావరేజింగ్’ అంటారు. మార్కెట్ మళ్లీ పుంజుకున్నప్పుడు, ఈ అదనపు యూనిట్లు మీ పోర్ట్‌ఫోలియో విలువను వేగంగా పెంచుతాయి. దీనిని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

పెట్టుబడిని ఆపివేయడం వల్ల ‘కాంపౌండింగ్’ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం (పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ వంటివి) చేసే పెట్టుబడులు నిరంతరాయంగా సాగాలి. మధ్యలో ఆపివేస్తే, తిరిగి ప్రారంభించినప్పుడు ఆ పాత వేగాన్ని అందుకోవడం కష్టమవుతుంది. మార్కెట్ ఎప్పుడు బాటమ్ అవుతుందో అంటే అత్యంత కనిష్ట స్థాయికి చేరుతుందో ఎవరూ ఊహించలేరు. తక్కువలో ఉన్నప్పుడు ఆపేసి, పెరిగినప్పుడు మళ్ళీ మొదలుపెడదాం అనుకోవడం పొరపాటు. చాలా సందర్భాలలో మార్కెట్ ఒక్కసారిగా కోలుకుంటుంది, ఆ సమయంలో మీరు ఇన్వెస్ట్ చేయకపోతే వచ్చే లాభాలను మిస్ అవుతారు.

విజయవంతమైన ఇన్వెస్టర్ కావాలంటే మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలి. ధరలు తగ్గినప్పుడు అది ‘సేల్’ లాంటిదని భావించాలి. మార్కెట్ పతనంలో SIP కొనసాగించడం వల్ల మీ సగటు కొనుగోలు ధర తగ్గుతుంది, ఇది భవిష్యత్తులో మెరుగైన రిటర్న్స్‌కు దారితీస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు SIPని ఆపడం కంటే, వీలైతే అదనపు మొత్తాన్ని (Lumpsum) పెట్టుబడిగా పెట్టడం మేలు. భయంతో తీసుకునే నిర్ణయాలు మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తాయి. కాబట్టి.. మీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మార్కెట్ ఒడిదుడుకులను పట్టించుకోకుండా ప్రయాణాన్ని కొనసాగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.