
- బెంగాల్లో 92.7 శాతం, తమిళనాడులో 85.14 శాతం నమోదు
- రెండు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్
- ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
- బెంగాల్‌లో అక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలు, ఓటర్ల ఆందోళనలు
- పలుచోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు
- తమిళనాడులో ప్రశాంతంగా ఎన్నికలు
- డీఎంకే, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, టీవీకే మధ్య తీవ్ర పోటీ
కోల్‌కతా/చెన్నై: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ తొలి విడతలో 92.72 శాతం, తమిళనాడులో 85.14 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ప్రకటించింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవగా, తొలి రెండు గంటల్లోనే తమిళనాడులో 17.69 శాతం, బెంగాల్‌లో 18.76 శాతం నమోదైంది. ఎండ తీవ్రత పెరగకముందే ఓటు వేయాలని ప్రజలు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకుగాను తొలి విడతలో 152 స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలు మే 4న వెల్లడి కానున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూలైన్లలో ఉండడంతో వారికి ఓటు వేసే అవకాశం
కల్పించారు.
విదేశాల నుంచి వచ్చి ఓటు
తమిళనాడులో అధికార డీఎంకే, అన్నాడీఎంకే–-బీజేపీ కూటమి, విజయ్ నేతృత్వంలోని టీవీకే వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 234 స్థానాలకు 4,023 మంది అభ్యర్థులు బరిలో దిగారు. చెన్నైలో సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, నటుడు-, నాయకుడు విజయ్, అజిత్, సూర్య వంటి ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నమక్కల్‌లో 110 ఏళ్ల మరియాయి అనే మహిళ ఓటు వేసి సీఎన్ అన్నాదురై నుంచి ఎంజీఆర్ వరకు అందరినీ చూశానని చెప్పారు. సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లూ ఉన్నారు.
బెంగాల్ లో పటిష్ట భద్రత మధ్య..
బీజేపీకి కంచుకోటగా భావించే ఉత్తర బెంగాల్, ముర్షిదాబాద్, నదియా, మాల్దా వంటి సరిహద్దు జిల్లాల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న 152 స్థానాల్లో మొత్తం కోటి 75 లక్షల మంది మహిళలు సహా మొత్తం 3.60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం 8 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, 2.45 లక్షల మంది కేంద్ర జవాన్లను మోహరించింది. అయితే బీర్భూమ్ జిల్లా దుబ్రాజ్‌పూర్ నియోజకవర్గంలో ఈవీఎంలో టీఎంసీకి వేసిన ఓట్లు బీజేపీకి పడుతున్నాయని ఓటర్లు ఆందోళన చేయడంతో సుమారు 30 నిమిషాలు పోలింగ్ నిలిచిపోయి ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర బలగాలు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చాయి. ముర్షిదాబాద్‌లో నోడా గ్రామం సమీపంలో పోలింగ్ బూత్ వద్ద పెట్రోల్ బాంబులు విసిరారు. అలాగే ఝార్‌గ్రామ్ జిల్లాలో ఒక పోలింగ్ స్టేషన్ సమీపానికి ఏనుగు రావడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో రఘునాథ్‌పూర్ పోలింగ్ బూత్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎంలోని బీజేపీ కమలం గుర్తుపై ఇంక్ పూశారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకుడు సౌమిత్ర ఖన్ సోషల్ మీడియాలో వెల్లడించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి ఆ ఇంక్‌ను శుభ్రం చేసి పోలింగ్ కొనసాగించారు.
బీజేపీ అభ్యర్థులపై దాడి!
బెంగాల్ లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కుమార్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్‌పై దాడి జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నించగా టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆయన చెప్పారు. కొన్ని బూత్‌లలో తమ ఏజెంట్లను బయటకు పంపించారని తెలిపారు. ఇదే సమయంలో అసన్సోల్‌లో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ కారుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో కారు అద్దం పగిలింది. ఈ ఘటనపై ఆమె ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఓటర్లకు రోబో టీనా వెల్ కం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన రోబో పోలింగ్ కేంద్రం వద్ద అందరి దృష్టిని ఆకర్షించింది. చీర కట్టుకుని ఉన్న ఈ రోబోకు ‘టీనా’అని పేరు పెట్టారు. ఇది ఓటర్లకు స్వాగతం పలుకుతూ వారికి స్వీట్లను పంపిణీ చేసింది. వాయిస్ ప్రాసెసింగ్, రేడియో కంట్రోల్ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో ఓటర్లను క్యూలైన్లో నిలబడాలని, ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించింది. ఈ ప్రాజెక్ట్ గురించి విద్యార్థి డెవలపర్ విమల్ విజయన్ మాట్లాడుతూ ” వంద శాతం ఓటింగ్ నమోదు కావాలనే లక్ష్యంతో ఈ రోబోను తయారు చేశాం” అని అన్నారు.