Reading Time: < 1 minute
Sarvaram Ci Ravikumar Transferred In Driver Subrahmanyam Murder Case

Driver Subrahmanyam Murder Case: కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పవరం ఇన్‌ఛార్జ్ సీఐ రవికుమార్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఇన్‌ఛార్జ్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే రవికుమార్‌ను వీఆర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు తమను బెదిరిస్తున్నారని కొందరు సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, ఆ విషయాన్ని సీఐ రవికుమార్ ఎమ్మెల్సీకి చేరవేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్‌ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..

గత, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో సీఐ రవికుమార్‌కు సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణాలతోనే ఆయనను కేసు దర్యాప్తు నుంచి తొలగించినట్లు సమాచారం. ఇకపై డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుకు అప్పగించారు. కేసు విచారణను వేగవంతం చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కాకినాడ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.