Reading Time: < 1 minute
Paper Plates: పేపర్‌ ప్లేట్లలో భోజనం చేసే అలవాటు మీకూ ఉందా? అయితే మీ ఒంట్లోకి క్యాన్సర్..

మన చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ ఫంక్షన్‌, శుభకార్యం జరిగినా.. భోజనాల్లో మాత్రం పేపర్ ప్లేట్లు తప్పనిసరిగా కనిపిస్తాయి. పేదింటి పెళ్లిళ్ల నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఫంక్షన్‌ వరకు ప్రస్తుత కాలంలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. గతంలో అతిథులకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్లలో భోజనాలు ఒడ్డించేవారు. ప్రస్తుతం మాత్రం వీటికి బదులుగా పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఇటువంటి ప్లేట్లలో వేడి ఆహారం తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పేపర్ ప్లేట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఏం చెప్పారంటే..

సాధారణంగా ఫంక్షన్లలో వేడి ఆహారాన్ని కాగితం ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ పూత ఉన్న ప్లేట్లలో తింటాం. కానీ ఇవి సాధారణ ప్లేట్లు కావు. ఇవి క్యాన్సర్ ప్లేట్లు. అవును.. వేడి ఆహారం వల్ల ప్లేట్‌పై ఉన్న ప్లాస్టిక్ పూత కరిగిపోతుంది. దానివల్ల మైక్రోప్లాస్టిక్‌లు, హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని వ్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం, పర్యావరణానికి కూడా నష్టం కలుగుతుంది. ఇలాంటి ప్లేట్లను వాడి పారేసినప్పుడు వాటిని ఆవుల వంటి జంతువులు తిని చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వాటిని కాల్చినట్లయితే అవి విషపూరిత పొగలను వెలువరించి గాలిని కలుషితం చేస్తాయి. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు మరింత పెరుగుతాయి.

నిపుణులు ఏమంటున్నాంటే..

పర్యావరణానికి, ఆరోగ్యాన్ని కాపాడటానికి పేపర్‌ ప్లేట్లకు బదులుగా సహజ పదార్థాలతో చేసిన ప్లేట్లను ఉపయోగించడం మంచిది. పోక ఆకు ప్లేట్లు, అరటి ఆకులు, వెదురు పళ్ళాలు వంటివి వినియోగించవచ్చు. కాబట్టి కాగితం ప్లేట్లలో భోజనం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.