Reading Time: < 1 minute
పచ్చని కాపురంలో అనుమాన చిచ్చు.. అమ్మ కాటికీ.. నాన్న జైలుకు.. అనాథలుగా ఇద్దరు బిడ్డలు!

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో అనుమానం అనే పెనుభూతం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న తీరు స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే, విచక్షణ కోల్పోయి టైలరింగ్ కత్తెరతో ఆమె గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

రుద్రవరానికి చెందిన వెంకట చెన్నయ్యకు మొదటి భార్య చనిపోవడంతో, 14 ఏళ్ల క్రితం చిత్రేనిపల్లికి చెందిన పుష్పను రెండో వివాహం చేసుకున్నాడు. వీరు నాలుగేళ్ల క్రితం ఆళ్లగడ్డకు కాపురం మార్చారు. చెన్నయ్య పండ్ల మండిలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న చెన్నయ్య, తరచూ ఆమెతో గొడవ పడేవాడు.

బుధవారం రాత్రి దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం (ఏప్రిల్ 23) ఉదయం తన పెద్ద కుమార్తెను పాఠశాలలో దింపి వచ్చిన చెన్నయ్య, ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్పపై ఒక్కసారిగా దాడి చేశాడు. తన వద్ద ఉన్న టైలరింగ్ కత్తెరతో ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానే స్వయంగా బంధువులకు ఫోన్ చేసి, భార్యను చంపేసినట్లు సమాచారం ఇచ్చాడు.

సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అనుమానం వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక చిన్న అనుమానం ఇద్దరు కుమార్తెలను అనాథలను చేయడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..