Reading Time: < 1 minute
ఇటు వానలు.. అటు ఎండలు.. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఒకవైపు తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరగనుంది. రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై వాతావరణ కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. దీని ఫలితంగా శుక్ర, శనివారాల్లో తెలంంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం నుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా

కోస్తాంధ్ర, రాయలసీమలో పరిస్థితి భిన్నంగా ఉంది. దక్షిణ, నైరుతి దిశల నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో ఇక్కడ ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది.
ఉత్తర కోస్తా, యానాంలో శుక్రవారం ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. కానీ శనివారం నుండి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడనుంది. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో రాగల మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుంది. వేడి, తేమ వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. రాయలసీమలో ఎండలు మండిపోనున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్య గమనికలు – జాగ్రత్తలు

ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున, కోత కోసిన పంటను భద్రపరుచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాయలసీమ, కోస్తా ప్రజలు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య బయట తిరగకపోవడం మంచిది. ఎక్కువగా నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదు.