Reading Time: < 1 minute

రెండో రోజూ నిలిచిన చక్రం.. ప్రయాణికుల పాట్లు

Caption of Image.

నెట్​వర్క్, వెలుగు : తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరుకోవడంతో ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. మెజారిటీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ప్రైవేట్ డ్రైవర్లు, అద్దె బస్సుల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బస్సుల రాక కోసం గంటల తరబడి వేచి చూడలేక ప్రయాణికులు, వేసవి సెలవులకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. 

నాగర్ కర్నూల్ డిపో వద్ద కార్మికులు వంటా-వార్పుతో నిరసన తెలిపారు. యాదగిరిగుట్ట డిపోలో టికెట్లు జారీ చేయకుండానే బస్సులు నడపడంతో ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారు. ఇదే క్రమంలో కొందరు తాత్కాలిక డ్రైవర్లు టికెట్లు ఇవ్వకుండానే చార్జీలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సమ్మె ఉధృతం కావడంతో ఎస్పీలు డిపోలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విధులకు ఆటంకం కలిగించిన పలువురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు దుబ్బాకలో కార్మికులకు సంఘీభావం తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.