Reading Time: 2 minutes
Off The Record About Topudurthi Prakash Reddy Faces Political Confusion In Raptadu Constituency

Off The Record: నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. ఏ నాయకుడు ఎక్కడ ఉంటాడో, ఎవరి నియోజకవర్గం ఎలా మారుతుందో తెలియదుగానీ….అలాంటిదేం జరక్కుండానే… తన భవిష్యత్‌ ఏంటో అర్ధంగాక గందరగోళంలో ఉన్నారట రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. ప్రస్తుతం తాను ఏజిల్లాలో ఉండాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారాయన. తాను మనసు పడ్డ చోట వైసీపీ నాయకులు నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టేయడంతో ఏం బాధలురా… బాబూ…. అంటూ తల పట్టుకుంటున్నట్టు సమాచారం. భౌగోళికంగా రాప్తాడు నియోజకవర్గానిది విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ మొత్తం ఆరు మండలాలు ఉంటే…. మూడు శ్రీ సత్యసాయి జిల్లాలో, మరో మూడు మండలాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే సమస్య వచ్చి పడుతోందట తోపుదుర్తికి. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇదేమంత సమస్య అనిపించకున్నా… పవర్‌ పోయాక సహజంగానే పరిస్థితులు, ప్రయారిటీస్‌ మారతాయి కాబట్టి ప్రకాష్‌రెడ్డి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలను ఏ జిల్లాకు ఆ జిల్లాలో విడివిడిగా చేసుకోవాల్సి వస్తోంది. ఇదంతా మాజీ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారిందట. నియోజకవర్గ పరంగా తన కార్యకలాపాలను ఎక్కడి నుంచి నిర్వహించాలన్న కన్ఫ్యూజన్ వస్తోంది. వైసీపీ రాష్ట్ర కమిటీ ఏదైనా పిలుపునిస్తే శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో నిర్వహిస్తున్నారాయన.

అదే సమయంలో అనంతపురం పరిధిలోని మూడు మండలాల సంగతేంటన్న ప్రశ్న వస్తోంది. వాస్తవానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గ స్థాయి కార్యాలయం ఎక్కడా లేదు. ఇక మండల కేంద్రాల సంగతి చెప్పే పనేలేదు. దీంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏ సమావేశం నిర్వహించాల్సి వచ్చినా.. తన ఇంటినో, లేదా ఏదైనా ఫంక్షన్ హాల్‌నో ఎంచుకునేవారు. ఇక అప్పట్లో అధికారికంగా పార్టీ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించాలంటే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ప్రెస్‌మీట్‌ పెట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందట. ఇటీవల తాను ప్రెస్మీట్ పెట్టాలని చూడగా… అక్కడ ఉన్న ఒక మేనేజర్ జిల్లా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. దీంతో… పార్టీ ఆఫీస్‌ ప్రతిపాదన విరమించుకుని తన ఇంట్లోనే కార్యక్రమం ముగించేశారాయన. అనంతపురం సంగతి అలా ఉంటే… ఇటు శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా అవే సమస్యలు వస్తున్నాయట. అసలు ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇప్పటివరకు ఏర్పాటవలేదు. ఇటు పార్టీ ఆఫీస్‌ లేక, అటు నియోజకవర్గ కార్యాలయం లేక ఎక్కడికి వెళ్లాలన్నది అర్థంకాని పరిస్థితి తోపుదుర్తిది. చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాల్లో నాయకులకు టచ్‌లో ఉండాలంటే అనంతపురంలోని తన నివాసమే కేంద్రంగా మారిపోయింది.

దీంతో ఈ సమస్యను అధిగమించడానికి ఆయన ఇటీవల ధర్మవరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానన్న ప్రతిపాదన తెర పైకి తీసుకొచ్చారు. కానీ…అది ఇంకో వివాదానికి దారితీసింది. ధర్మవరానికి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాలు చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడి ప్రజలు కూడా ఆర్డీఓ కార్యాలయం కోసం అక్కడికే వస్తుంటారు.. దీంతో తనకు కూడా ధర్మవరం అయితే సుఖంగా ఉంటుందని భావించారట ప్రకాష్‌రెడ్డి. కానీ… ఆ ప్రతిపాదనపై అక్కడి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో మరో నేత ఆఫీస్‌ ఏంటన్నది ఆయన అభ్యంతరం. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సర్పంచ్‌ల సన్మాన సభలో సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి… కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు వైసీపీ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ప్రకాష్ రెడ్డిని ఆహ్వానించలేదన్న ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా పరిధిలో రాప్తాడు నియోజకవర్గం మండలాలు మూడు ఉన్నా…ఆ నియోజకవర్గ సమన్వయకర్త ప్రకాష్ రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే…. జిల్లా వైసీపీ నాయకులే తోపుదుర్తిని పథకం ప్రకారం ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయంటున్నారు పరిశీలకులు.