Reading Time: 2 minutes
Pm Modi Bengal Election Jungle Raj End May 4

మే 4న ఆటవిక పాలన అంతం కాబోతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండో దశలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా డం డం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సభలో మోడీ మాట్లాడారు. ‘‘పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. బెంగాల్ ఎన్నికల మొదటి దశలో జరిగిన పోలింగ్.. గత కొంతకాలంగా గమనిస్తున్న మార్పు కనిపిస్తోంది. నిన్న బీజేపీకి లభించిన మద్దతు.. బీజేపీ విజయానికి సంకేతం..’’ అని అన్నారు.

‘‘రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వాన్ని మార్చేస్తామని బెంగాల్ మహిళలు చెబుతున్నారు. టీఎంసీ ఒక మహిళా వ్యతిరేక పార్టీ. బీజేపీ మాత్రం మహిళా నేతృత్వ అభివృద్ధి నమూనాపై పనిచేస్తుంది. ఓ కూతురు.. టీఎంసీ అరాచక పాలనకు బలైపోగా.. బీజేపీ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టింది. సందేశ్‌ఖాలి బాధితులకు కూడా నాయకత్వం వహించేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. బెంగాల్ కుమార్తెలు న్యాయం కోరినప్పుడు.. అత్యాచారానికి గురికాకుండా ఉండేందుకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని టీఎంసీ చెబుతుంది. మహిళలు కలలు కనడం టీఎంసీకి ఇష్టం లేదు. బెంగాల్ కుమార్తెల కలలను ఎవరూ తొక్కేయడానికి బీజేపీ అనుమతించదని ఈ రోజు నేను బెంగాల్‌లోని ప్రతి కుమార్తెకు హామీ ఇస్తున్నాను. మహిళల భద్రతే మా ప్రాధాన్యత అని నేను మీకు హామీ ఇస్తున్నాను. మే 4న బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై జరిగిన అన్ని అఘాయిత్యాలపై ఫైళ్లను తెరుస్తాం. ఇది మోడీ హామీ.’’ అని పేర్కొన్నారు.

‘‘ఇది విప్లవాల గడ్డ. ఇది వీరుల నేల అని మర్చిపోవద్దు. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి ఏ చోటూ దొరకదు. వారిని రక్షించడానికి ఎవరూ ఉండరు. నిన్న జరిగిన మొదటి దశ పోలింగ్.. టీఎంసీ సాగిస్తున్న ‘అటవిక పాలన’కు మరణఘంటిక మోగించింది.’’ అని అన్నారు.

‘‘బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మధ్యతరగతి ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. 2014కు ముందు ఢిల్లీలోని ప్రభుత్వం టీఎంసీ మద్దతుతో నడుస్తున్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు ఉన్న వార్షిక ఆదాయంపై కూడా పన్ను విధించేది. మేము రూ. 12 లక్షల వరకు ఉన్న వార్షిక ఆదాయంపై పన్నును పూర్తిగా తొలగించాం. దీన్ని ‘సున్నా’ స్థాయికి తీసుకువచ్చాము.’’ అని అన్నారు.