Reading Time: 2 minutes
చిరు, వెంకీ, నాగ్‌లతో సూపర్ హిట్స్.. కానీ బాలయ్య ఒక్క సినిమా కూడా చేయలేదు

నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో విశేషమైన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు బాలయ్య. తాతమ్మ కల సినిమాతో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, 1984లో సాహసమే జీవితం చిత్రంతో హీరోగా నిలదొక్కుకున్నారు. అప్పటినుండి నేటి వరకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాలయ్య కెరీర్‌లో ఎందరో స్టార్ హీరోయిన్లతో కలిసి నటించి విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే, సినీ ప్రియులను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో మాత్రం బాలకృష్ణ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలోనూ వారితో బాలయ్య సినిమాలు చేయలేదు.

ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ

ఒకప్పుడు అగ్రతారలైన అతిలోక సుందరి శ్రీదేవి,  మాధవి మాత్రం బాలకృష్ణ సరసన ఒక్క సినిమాలోనూ నటించలేదు. శ్రీదేవి విషయానికి వస్తే, ఆమె ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి మొదటి తరం హీరోలతో పాటు కృష్ణ, శోభన్ బాబు వంటి రెండో తరం హీరోలతో, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి మూడో తరం హీరోలతో కూడా నటించారు. కానీ, మూడో తరంలో బాలకృష్ణతో మాత్రం ఆమె జత కట్టలేదు. దీనికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తన తండ్రి ఎన్టీఆర్ గారితో నటించిన హీరోయిన్లతో తాను నటించకూడదని బాలకృష్ణ నిర్ణయించుకున్నారనేది ఒక వాదన. 1987లో దర్శకుడు రాఘవేంద్ర రావు సామ్రాట్ సినిమాను బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్‌లో తీయాలని అనుకున్నారు. దీనికి శ్రీదేవి కూడా అంగీకరించారు. అప్పట్లో పేపర్లలో ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే, అదే సమయంలో శ్రీదేవి బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరక ఈ సినిమా ఆగిపోయింది. అదే విధంగా, 1989లో భలే దొంగ సినిమాలో కూడా బాలయ్య సరసన శ్రీదేవి నటించాలనుకున్నారు, కానీ అప్పుడు కూడా ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవిని తీసుకుంటే దేశవ్యాప్తంగా సినిమాకు పాపులారిటీ వస్తుందని భావించినా అది కుదరలేదట.

ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఇక మాధవి విషయానికి వస్తే, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోల సరసన నటించకముందే ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు. అప్పటికే బాలయ్య గారికి సీనియర్ హీరోయిన్ కావడంతో పాటు, ఇతర భాషల చిత్రాలతో ఆమె బిజీగా ఉండటం వల్ల వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదని చెప్పవచ్చు. అప్పటి మేకర్స్, దర్శకులు బాలకృష్ణకు సుహాసిని, విజయశాంతి, రాధా వంటి హీరోయిన్లను జతకట్టి విజయవంతమైన చిత్రాలు తీయడంతో, మాధవి-బాలకృష్ణ కాంబినేషన్ మిస్ అయిందని అంటుంటారు. మాధవి చిరంజీవి సరసన ప్రాణం ఖరీదు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దొంగ మొగుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి మెప్పించారు. ఈ విధంగా బాలకృష్ణ సినీ కెరీర్‌లో శ్రీదేవి, మాధవి వంటి అగ్రతారలతో కలిసి నటించే అవకాశం కుదరలేదు.

ఇది కూడా చదవండి : 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.