Reading Time: < 1 minute
Islamabad In Lockdown For 10 Days Pakistan Public Angry Over Restrictions

Islamabad in Lockdown: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ గత 10 రోజులుగా అప్రకటిత లాక్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల అవకాశాలు, ఉన్నతస్థాయి విదేశీ ప్రతినిధుల పర్యటనల నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అయితే, ఈ ఆంక్షలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇస్లామాబాద్‌లో ప్రధాన రహదారులను మూసివేయడంతో పాటు మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు కూడా మూతపడ్డాయి. నగరమంతా సైన్యం, పోలీసులు మోహరించడంతో ప్రజా రవాణా కూడా దాదాపు నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించగా, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు మాత్రం ఆదాయం లేక తీవ్ర కష్టాల్లో పడిపోయారు.

Read Also: Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

ఇప్పటికే ద్రవ్యోల్బణం, పేదరికంతో సతమతమవుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఈ పరిస్థితి మరింత భారంగా మారింది. పని లేక, సంపాదన లేక కుటుంబాలను పోషించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయా, రద్దయ్యాయా అనే స్పష్టత లేక ప్రజల్లో అసహనం పెరుగుతోంది. స్థానిక నివాసి మహమ్మద్ సాబిర్ మాట్లాడుతూ, కొన్నిసార్లు ట్రంప్ వస్తున్నారని, మరికొన్నిసార్లు ఇరాన్ అధ్యక్షుడు వస్తున్నారని చెబుతున్నారని, కానీ ప్రజల సమస్యలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యాపారం లేదు, పని లేదు, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లోని కొన్ని హాస్టళ్లను ఖాళీ చేయించడంతో వేలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా గదులు ఖాళీ చేయించడంతో కొత్త వసతి కోసం వారు పరుగులు తీయాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న అరీజ్ అక్తర్ మాట్లాడుతూ, ప్రజా రవాణా నిలిచిపోవడంతో తిరిగి నగరానికి చేరుకోలేకపోతున్నామని తెలిపారు. తాము పంజరంలో బంధించబడ్డట్లుగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా.. అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ, ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, సామాన్య ప్రజల జీవితం మాత్రం స్తంభించిపోయింది. చర్చలు ముగిసే వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.