Reading Time: 2 minutes
Mi Vs Csk 2026 Tilak Varma Vs Jamie Overton Verbal Clash At Wankhede Goes Viral

MI vs CSK: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ హై వోల్టేజ్ డ్రామా, టెన్షన్, ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇదే మళ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌లోను కనిపించింది. ముంబై లోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో తిలక్ వర్మ, జేమీ ఓవర్టన్ మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబై బ్యాటింగ్ సమయంలో 10వ ఓవర్ వేయడానికి వచ్చిన CSK ఫాస్ట్ బౌలర్ జేమీ ఓవర్టన్, తన ఓవర్ చివరి బంతిని స్లో ఆఫ్‌కట్టర్‌గా వేయగా, తిలక్ వర్మ దాన్ని డీప్ మిడ్‌వికెట్ వైపు ఆడాడు. ఒక రన్ తీసుకున్న తర్వాత రెండో రన్ కోసం ప్రయత్నించగా, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ అతన్ని వెనక్కి పంపాడు. ఈ సమయంలో ఓవర్టన్ బౌలింగ్‌కు రాగా ఫీల్డర్లు కదులుతున్నారని తిలక్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

“ఫీల్డర్ కదులుతున్నాడు, మీరు బౌల్ చేయబోతున్నప్పుడు అతను హాఫ్‌వేలో ఉన్నాడు” అంటూ గట్టిగా మాట్లాడాడు. దీనికి ఓవర్టన్ కూడా సమాధానం ఇవ్వడంతో మైదానంలో కాస్త మాటల యుద్ధం పెరిగింది. టీవీ రిప్లేల్లో కూడా ఫీల్డర్ కదులుతున్నట్టు కనిపించడంతో తిలక్ అభ్యంతరం కొంతవరకు సమర్థించబడింది. ఈ ఘటన తర్వాత అకీల్ హోసైన్ స్పిన్‌ కు తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఓవర్టన్, ముంబై టెయిలెండర్ కృష్ణ్ భగత్ వికెట్ తీసుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 207/6 భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ కేవలం 54 బంతుల్లో 101* పరుగులు చేసి ఈ సీజన్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు. చేజింగ్‌లో ముంబై ఇండియన్స్ పూర్తిగా విఫలమైంది. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ముంబై జట్టు 104 పరుగులకే ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ (35), తిలక్ వర్మ (37) తప్ప మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అకీల్ హోసైన్ 4/17తో మ్యాచ్ ను పూర్తిగా చెన్నై వైపు తిప్పేసాడు.

ఈ మ్యాచ్‌లో మరో వివాదం కూడా చర్చనీయాంశమైంది. మిచెల్ సాంట్నర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడం పట్ల అభిమానులు విమర్శలు గుప్పించారు. “ఇది చీటింగ్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.