Reading Time: 2 minutes
IPL 2026 LSG vs RR : సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన.. ఓనర్ రియాక్షన్ ఇదే

IPL 2026 LSG vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 160 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, చేతులెత్తేసి 119 పరుగులకే కుప్పకూలింది. అయితే, మ్యాచ్ ఫలితం కంటే కూడా మైదానం బయట లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో పిచ్‌పై ఇది చాలా తక్కువ స్కోరు అని అందరూ భావించారు. కానీ లక్నో బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. మొదటి ఓవర్‌లోనే బదోని రన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి ఎదురుదాడికి దిగాడు. కేవలం మూడు బంతులు ఆడిన పంత్, భారీ షాట్ కు ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. దీంతో టీమ్ మొత్తం ఒత్తిడిలోకి వెళ్లి 119 పరుగులకే ఆలౌట్ అయింది.

సాధారణంగా సంజీవ్ గోయెంకా అంటే క్రికెట్ పట్ల చాలా ఎమోషనల్ గా ఉంటారు. గతంలో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఓటమి తర్వాత మైదానంలోనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే బుధవారం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పంత్ మరియు సంజీవ్ గోయెంకా ఎదురుపడ్డారు. పంత్‌ను గోయెంకా నవ్వుతూ హత్తుకున్నారు. ఓటమి భారంతో ఉన్న కెప్టెన్ కు ఆయన భరోసా ఇస్తున్నట్లుగా ఆ ఫోటోలో కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు గోయెంకాలో ఇంత మార్పు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు.

మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాల గురించి ప్రశ్నించగా, రిషబ్ పంత్ దగ్గర సమాధానం లేకపోయింది. మేము ఎక్కడ తడబడ్డామో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు అని పంత్ అన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఈ మ్యాచ్ ఓడిపోయామని ఆయన అంగీకరించారు. బాధ్యతారాహిత్యంగా షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసిందని, వచ్చే మ్యాచుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని పంత్ చెప్పుకొచ్చారు.

సంజీవ్ గోయెంకాను విమర్శించే వారంతా ఈ వైరల్ ఫోటో చూసి సైలెంట్ అయిపోయారు. గెలిచినా ఓడినా ఆటగాళ్లకు అండగా ఉండటమే నిజమైన టీమ్ ఓనర్ లక్షణమని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో రిషబ్ పంత్ తన ఫామ్ పై దృష్టి పెట్టాలని, కెప్టెన్ గా ఇలాంటి కీలక మ్యాచుల్లో డకౌట్ అవ్వడం టీమ్ మోరల్ ను దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..