Reading Time: 2 minutes
ఆర్టీసీ ‘పోరు’బాట.. సమ్మె ఉధృతం.. ఇవాళ సర్కార్‌తో చర్చల పర్వం!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఆత్మబలిదానం ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా తన డిమాండ్ల సాధన కోసం నర్సంపేట బస్టాండ్‌ ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్‌గౌడ్‌, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆర్టీసీ సమ్మె సెగలు కొనసాగుతున్నాయి. మూడో రోజుకు చేరుకున్న ఈ పోరాటం మరింత ఉధృతం కానుంది. నేటి నుంచి ఆరు రోజుల పాటు చేపట్టాల్సిన నిరసనలకు ఆర్టీసీ జేఏసీ (JAC) ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు అన్ని డిపోల ముందు కార్మికులు మౌన ప్రదర్శన చేపట్టనున్నారు. అయితే, పోరాట క్రమంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సంయమనం పాటించాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం నేడు రెండు దశల్లో చర్చలు జరపాలని నిర్ణయించింది. మొదటి దశలో ఉదయం 10 గంటలకు ఐఏఎస్ అధికారుల కమిటీ (వికాస్‌రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియా) తో ఆర్టీసీ యూనియన్ నేతలు భేటీ అవుతారు. రెండో దశలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కార్మిక సంఘాలు సమావేశం కానున్నారు.

ఇదిలావుంటే, ప్రధానంగా కార్మికులు మొత్తం 17 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచగా, వాటిలో మూడు అంశాలు అత్యంత కీలకంగా మారాయి. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాని డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అలాగే, కార్మిక సంఘాల గుర్తింపు కోసం తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. చివరగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నడపాలని, మహాలక్ష్మి పథకానికి అదనపు బస్సులు కేటాయించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఇప్పటికే 29 డిమాండ్లను నెరవేర్చామని, గతంతో పోలిస్తే పరిస్థితులు మెరుగుపడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సమ్మెకు బీఆర్ఎస్ నేతలు మద్దతు పలకడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి చర్చలు సఫలమైతేనే ప్రయాణికులకు ఊరట లభించే అవకాశం ఉంది.

మరోవైపు, సమ్మె ఉధృతంగా సాగుతున్న తరుణంలో, ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను తొలుత వరంగల్ ఎంజీఎంకు, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఆయన మృతిపై సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించినప్పటికీ, చివరకు విషాద వార్తే వినాల్సి వచ్చింది.

శంకర్‌గౌడ్ మృతి సమాచారం తెలియగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు ఇవాళ నర్సంపేటకు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం కార్మికులకు మద్దతుగా ధర్నాలో పాల్గొంటున్నాయి.

శంకర్‌గౌడ్‌ మృతితో వరంగల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. హనుమకొండ డిపో ముందు కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు భారీ ధర్నా చేపట్టాయి. కాగా, కాసేపట్లో శంకర్‌గౌడ్ మృతదేహం నర్సంపేటకు చేరుకోనుంది. ఈ అంతిమ సంస్కారాల్లో ఉమ్మడి జిల్లా కార్మికులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటానికి సిద్ధమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఆర్టీసీ డ్రైవర్ మరణంపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికొదిలేయడంవల్లే ఈ దుస్థితి నెలకుందని విమర్శించారు. బీజేపీ పక్షాన శంకర్‌ గౌడ్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..