Reading Time: 2 minutes

బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ వివాదం: భారత్, చైనా నరకకూపాలంటూ పోస్ట్ షేర్ చేసిన ట్రంప్..

Caption of Image.

అగ్రరాజ్యం అమెరికాలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వం వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ భారత్, చైనా వంటి దేశాలను తీవ్రంగా అవమానించేలా ఉండటం చర్చనీయాంశమైంది. ప్రముఖ కన్జర్వేటివ్ టాక్ షో హోస్ట్ మైఖేల్ సావేజ్ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించడమే కాకుండా, వాటి ట్రాన్స్‌క్రిప్ట్‌ను స్వయంగా పోస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.

భారత్, చైనాలపై కామెంట్స్.. 

భారత్, చైనా సహా ఇతర దేశాలను “నరకకూపాలు” అంటూ  సంబోధించారు మైఖేల్ సావేజ్. ఈ దేశాల నుండి గర్భిణీలు 9వ నెలలో విమానాల్లో అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లలకు జన్మనిస్తున్నారని, తద్వారా ఆ పిల్లలకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తోందని మండిపడ్డారు. ఇలా పౌరసత్వం పొందిన తర్వాత.. ఆ పిల్లల ద్వారా తమ ఫ్యామిలీ మొత్తాన్ని చైనా, భారత్ వంటి దేశాల నుండి అమెరికాకు రప్పిస్తున్నారని ఆరోపించారు.

రాజ్యాంగంపై విమర్శలు.. 

అమెరికా రాజ్యాంగం విమానాలు, ఇంటర్నెట్ లేని కాలంలో రాశారని.. అది ఇప్పటి వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం సరిపోదని సావేజ్ విమర్శించారు. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అనేది కోర్టుల్లో లాయర్లు తేల్చాల్సిన విషయం కాదని.. దానిపై దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అమెరికాలో ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే వారే కరువయ్యారని, వలసదారులకు దేశంపై భక్తి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ALSO READ : పెట్రోల్ రేట్లు పెరగవు.. పెరగబోవు.. పెరిగేది లేదు

ACLUపై విరుచుకుపడ్డ ట్రంప్ వర్గం

అమెరికన్ సివిల్ లిబరీటీస్ యూనియన్(ACLU) లాయర్లను సావేజ్.. ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు అంటూ సీరియస్ కామెంట్స్ చేసారు. ఈ లాయర్లు అమెరికాను చైనాకు కాలనీగా మార్చాలని చూస్తున్నారని.. ఈ కుట్రలో చైనా మాత్రమే కాదు భారత్ కూడా ఉందంటూ ఆరోపించారు. కాలిఫోర్నియాలో వలసదారుల ముసుగులో భారీగా సంక్షేమ పథకాల మోసాలు జరుగుతున్నాయని, వీరికి ACLU రక్షణ కల్పిస్తోందని విమర్శించారు.

పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ ముగిసిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ప్రపంచంలోనే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను అనుమతిస్తున్న ఏకైక తెలివితక్కువ దేశం అమెరికానే అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 36 దేశాల్లో ఈ విధానం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. మెుత్తానికి ఈ పరిణామాలు ప్రస్తుతం అమెరికాలోని భారతీయుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.