
IPL 2026: వాంఖడే స్టేడియంలో మరికాసేపట్లో ముంబై ఇండియన్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. ఈ క్రమంలో సీఎస్కే కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో లీగ్ నుంచి వైదొలిగిన ఆయుష్ మాత్రే స్థానంలో ఆకాశ్ మధ్వాల్ కి అవకాశం కల్పించింది. ఆయుష్ బ్యాటర్ కాగా.. ఇప్పుడు తీసుకున్న ప్లేయర్ పేసర్ కావడం గమనార్హం. తమ బౌలింగ్ యూనిట్ ని మరింత బలోపేతం చేసుకొనేందుకే చెన్నై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
కాగా ఆకాశ్ మధ్వాల్ కి ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. ఉత్తరాఖండ్ కి చెందిన ఇతడు 2023, 2024 సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. డెత్ ఓవర్లలో సూపర్బ్ బౌలింగ్ చేయడం మధ్వాల్ స్పెషాలిటీ. ఇప్పటికే సీఎస్కే పేస్ బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపించడంతో.. ఇప్పుడు అతడి రాకతో అటు ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ బలంగా మారబోతుంది. ఆకాశ్ ని సీఎస్కే రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఒకటి ఉంది. బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 5/5. ముంబై ఇండియన్స్ కి ఆడుతూ చెపాక్ వేదికగా లక్నో పై నిప్పులు చెరిగే బౌలింగ్ వేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో బెస్ట్ బౌలింగ్ అతడిదే.
►ALSO READ | MI vs CSK మధ్య ఉత్కంఠ పోరు.. ఈ మ్యాచులో రోహిత్ శర్మ ఆడేది డౌటే!
ఇక అభిమానులు ‘ఎల్-క్లాసికో’గా పిలుచుకునే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు జట్లు పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ క్రేజ్ మాత్రం భారీగా ఉంది. ఈ వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. కానీ బంతి పాతబడే కొద్దీ స్పిన్నర్లు కొంత ప్రభావం చూపవచ్చు. ఈ పిచ్ పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వాంఖడే స్టేడియంలో ఛేజింగ్ చేయడం సులభం కాబట్టి, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకుని, లక్ష్యాన్ని ఛేదించాలని చూస్తుంది. టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.