
నాన్ వెజ్ ప్రియుల్లో.. మటన్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. అయితే.. మేక మాంసం లోని ప్రతి భాగం ప్రత్యేకమైనదే.. మటన్.. మటన్ హెడ్, లివర్, తిల్లి, కాళ్లు, దబ్బ.. ఇలా అన్ని కూడా ఇష్టంగా తింటారు.. ఒక్కో పార్ట్ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది.. అయితే.. మేక తలకాయ ఎప్పుడూ స్పెషలే.. చాలా మంది ఆదివారం అని కాకుండా.. అన్ని సందర్భాలలో కొని తెచ్చుకుని ఇష్టంగా తింటారు. వాస్తవానికి మేక తలకాయ కూర సంప్రదాయ తెలుగు వంటకాల్లో ఒకటి.. మేక తలకాయ కూర పోషకాల గనిగా పేర్కొంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలు.. కీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ B12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన బలాన్ని, శక్తిని ఇస్తాయి.. అయితే.. కొన్ని పద్దతులతో మటన్ తలకాయ కూరను వండితే.. లొట్టలేసుకుంటూ మరి తినాల్సిందే..
మేక తలకాయ కూర స్పెషల్ తయారీ విధానం..
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో, సులభంగా రుచికరమైన మేక తలకాయ కూరను ఎలా తయారు చేయాలి..? ఈ వంటకం ప్రత్యేకత ఏమిటి.. రుచికరంగా.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
మటన్ హెడ్ కర్రీ కోసం సిద్ధం చేయడం:
సుమారు ఒక కిలో మేక తలకాయ కూరను కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వాసన రాకుండా శుభ్రంగా కడగాలి. తరువాత, ఈ మాంసాన్ని ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకొని, పావు టీ స్పూన్ పసుపు, రెండు మూడు టీ స్పూన్ల నూనె, టీ గ్లాసు కంటే తక్కువ నీటిని కలపాలి. తక్కువ నీటిని ఉపయోగించడం వలన విజిల్ వచ్చేటప్పుడు పొంగకుండా ఉంటుంది. ఒకసారి కలిపి మూత పెట్టి, రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మాంసం నాణ్యతను (లేతది లేదా ముదురుది) బట్టి విజిల్స్ సంఖ్య మారవచ్చు.. మొత్తానికి మాంసం 50% ఉడికినట్లు చూసుకోవాలి. లేత మాంసానికి 2 విజిల్స్ సరిపోగా, ముదురు మాంసానికి ఐదారు విజిల్స్ అవసరం కావచ్చు.
మసాలా పొడి తయారీ:
ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, మూడు యాలకులు, నాలుగైదు లవంగాలు, చిన్న జావిత్రి, ఒక అనైసాను తక్కువ మంటపై రెండు మూడు నిమిషాలు వేయించాలి. వేయించిన తరువాత, చల్లారనివ్వాలి.
ఉల్లిపాయ – కొబ్బరి పేస్ట్ తయారీ:
రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను నాలుగు భాగాలుగా పూర్తిగా కోయకుండా గాట్లు పెట్టాలి. ఒక చిన్న కొబ్బరి ముక్కతో పాటు ఈ ఉల్లిపాయలను కాల్చి తీసుకోవాలి. ఇలా కాల్చడం వల్ల కూరకు మంచి రుచి, సూప్‌కు చక్కని చిక్కదనం వస్తుంది. కాల్చిన ఉల్లిపాయ, కొబ్బరి ముక్కలను చల్లార్చాలి.
గ్రైండింగ్ ప్రక్రియ:
మొదటగా, వేయించిన మసాలాలు – కాల్చిన కొబ్బరి ముక్కలను మిక్సర్ జార్‌లోకి తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత, అదే మిక్సర్ జార్‌లోకి కాల్చిన ఉల్లిపాయ ముక్కలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
కూర వండటం:
స్టవ్ ఆన్ చేసి, కూర వండడానికి సరిపడా గిన్నెను తీసుకొని, మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, తరువాత గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తరువాత, మూడు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, నూనె పైకి తేలే వరకు వేయించాలి.
ఇప్పుడు, 50% ఉడికించిన తలకాయ కూరను వేసి బాగా కలపాలి. పావు టీ స్పూన్ పసుపు, నాలుగు టీ స్పూన్ల కారం (రుచికి సరిపడా), రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసిన మసాలా పొడిని కలపాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి, మూత పెట్టి తక్కువ మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.. తద్వారా మసాలాలు ముక్కలకు బాగా పడతాయి.
గ్రేవీ – చివరి దశ:
ఐదు ఆరు నిమిషాల తరువాత, గ్రేవీకి సరిపడా నీళ్లను కలపాలి. తలకాయ కూర గ్రేవీ సాధారణంగా మరీ చిక్కగా ఉండదు.. కాబట్టి సుమారు మూడు గ్లాసుల నీళ్లు కలపాలి. మాంసం పూర్తిగా మెత్తగా ఉడికే వరకు, మీడియం మంటపై 15-20 నిమిషాలు ఉడికించాలి. చివరగా, కొత్తిమీర ఆకు వేసి కలిపి స్టవ్ ఆపివేయాలి.
ఈ కమ్మకమ్మని తలకాయ కూర అన్నం, రాగి సంకటి, జొన్న రొట్టె, చపాతీ వంటి వాటితో అద్భుతంగా ఉంటుంది. ఈ సంప్రదాయ పద్ధతిలో వండిన కూర ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..