
Jadeja Dedicates Player of the Match Award to Wife Rivaba: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా రాజస్థాన్ 6 వికెట్లకు 159 పరుగులే చేయగా.. ఛేదనలో లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. ఆర్ఆర్ విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాట్‌తో 29 బంతుల్లో 43 రన్స్ చేసిన జడ్డు.. ఆపై బంతితో మాయ చేస్తూ 29 రన్స్ ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును తన భార్య, గుజరాత్ విద్యాశాఖ మంత్రి రివాబాకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.
మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం, జట్టు గెలవడం రెండూ బాగున్నాయి. ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నా భార్యకు అంకితం చేయాలనుకుంటున్నాను. నిన్ననే ఆమెతో మాట్లాడినపుడు రేపు నువ్వు అద్భుతం చేస్తావు అని చెప్పింది. ఆమె చెప్పిందే నిజమైంది. అందుకే రివాబాకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ వికెట్ అంత ఈజీగా లేదు. బంతి స్వింగ్, సీమ్ కూడా అవుతోంది. అందుకే సాధ్యమైనంత వరకు క్రీజ్‌లో ఉండాలనుకున్నాను. డోనోవన్‌తో కూడా ఇదే చెప్పను. తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌లతో కూడా కాసేపు క్రీజులో నిలబడదాం అని చెప్పాను. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చివరి ఓవర్‌లో మేము 20కి పైగా పరుగులు సాధించాం. మేం అనుకున్నది చేశాం’ అని చెప్పాడు.
‘గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మునుపటి వేగంతో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. మయాంక్ యాదవ్ కూడా అంతే. నేను నా బలాలపై నమ్మకం ఉంచాను. నా పార్ట్నర్‌తో కలిసి మంచి షాట్లు ఆడాలనుకున్నాను. ఈ వికెట్‌పై బంతి ఎక్కువగా సీమ్, బౌన్స్ అవుతుంది కాబట్టి ఏ షాట్ అయినా ఆడటం సులభం కాదు. పూరన్‌ను ఔట్ చేసిన హ్యాండ్స్ ఇన్ పాకెట్ సెలబ్రేషన్ చేయడంలో ఏం ప్రత్యేకం లేదు. ఆ క్షణంలో అలా చేయాలని అనిపించింది, చేశాను అంతే. బంతి పిచ్‌పై గ్రిప్ అవుతోంది. కాబట్టి వేగంగా వేయాలా లేక నెమ్మదిగా వేయాలా అని ఆలోచించాను. కొన్ని స్లో బాల్స్ వేయాలని నిర్ణయించుకున్నాను. మిడ్‌వికెట్, లాంగ్-ఆన్ వైపు బౌండరీ కొంచెం చిన్నగా ఉంది. మార్ష్ ఆ షాట్ ఆడే అవకాశం ఉందని నాకు తెలుసు. అందుకే వేగాన్ని మార్చుతూ స్లో, వైడ్, ఫుల్ బాల్స్ వేస్తూ ప్లాన్ చేశాను. నేనేం వసీం అక్రంలా మారిపోలేదు. ఈరోజు స్లో బంతులు వేయడంపై దృష్టి పెట్టాను’ అని జడ్డు చెప్పుకొచ్చాడు.