Reading Time: 2 minutes
Botsa Satyanarayana Fires At Chandrababu Over Jagan Era Project In Anakapalli

Botsa Satyanarayana: విశాఖపట్నంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతూ పలు అంశాలపై స్పందించారు. అనకాపల్లిలో వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టుకే ఇప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. అనకాపల్లి ప్రాంతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పరిశ్రమకు ఇప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేశారని బొత్స విమర్శించారు.. ఆ కంపెనీ సీఈవో, ఎండీని అడిగితే అసలు ఆ పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చిందో స్పష్టంగా చెబుతారని వ్యాఖ్యానించారు. మీడియా సహకారంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్‌కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన

ఎన్నికల ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడతామని కూటమి నేతలు హామీలు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు బొత్స… ప్రస్తుతం రూ.36 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఫ్యాక్టరీని ఆదుకున్నామని, ఇప్పుడు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మంత్రులు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని బొత్స మండిపడ్డారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.

ఉపాధి హామీ పథకంలో ప్రజలకు పనులు లేకుండా పోతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బొత్స.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి వీల్లేదని బొత్స స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, ప్రభుత్వం రూ.3.70 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ అప్పుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. వేల కోట్లు అప్పు తెచ్చి మెడికల్ కాలేజీల కోసం ఐదు, పది వేల కోట్లు కూడా ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు.

ప్రజల సమస్యలపై అమరణ నిరాహార దీక్ష చేస్తే ఆరు నెలల జైలు శిక్ష విధించడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే ప్రజాస్వామ్యంలో దీక్షలు చేస్తారని, దీక్షలు లేకపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పేరు చెబితే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని బొత్స అన్నారు. చంద్రబాబు ప్రతి విమర్శ తమకు దీవెనలాంటిదేనని, ఆయన తిట్లు తమపై ప్రభావం చూపవని వ్యాఖ్యానించారు. ఇక, మొదకోడమ్మ జాతర తేదీలను మార్చడం అమ్మవారితో రాజకీయం చేయడమేనని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజల విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు.