Reading Time: 2 minutes
MI vs CSK : అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో

MI vs CSK : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంటేనే అదొక ఎమోషన్. అయితే ఈ మ్యాచ్‌కు ముందు మైదానంలో ఆట కంటే కూడా గ్యాలరీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనికి కారణం చాహర్ బ్రదర్స్. దీపక్ చాహర్, రాహుల్ చాహర్ మధ్య జరగబోయే ఈ పోరుపై వారి సోదరి మాలతీ చాహర్ వేసిన పంచ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సొంత తమ్ముళ్లనే ఆటపట్టిస్తూ ఆమె చేసిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది.

ఐపీఎల్ 2026లో దీపక్ చాహర్ ముంబై ఇండియన్స్ జట్టులో ఉండగా, రాహుల్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో ఉన్నాడు. వాస్తవానికి దీపక్ గతంలో చెన్నైకి ఆడితే, రాహుల్ ముంబైకి ఆడేవాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అయితే వీరిద్దరి కంటే ముందుగా వీరి సోదరి మాలతీ చాహర్ లైమ్ లైట్ లోకి వచ్చారు. తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “నేను ఎప్పుడూ మీకు మద్దతుగా ఉంటాను.. ఒకవేళ మీరు మైదానంలో కాకుండా డ్రెస్సింగ్ రూమ్ పక్కన బెంచీ మీద కూర్చున్నా సరే నా సపోర్ట్ మీకే” అంటూ సెటైర్ వేశారు.

మాలతీ చాహర్ ఇలా అనడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ సీజన్‌లో వీరిద్దరికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. రాహుల్ చాహర్ చెన్నై తరఫున ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి వికెట్ ఏమీ తీయలేదు. ఇక ముంబై తరఫున ఆడుతున్న దీపక్ చాహర్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో కూడా కేవలం 6 పరుగులే చేశాడు. అందుకే మీరు ఆడినా ఆడకపోయినా బెంచీ మీదున్నా మీకు నేను తోడుంటాను అని అక్క ఆటపట్టించింది.

 

View this post on Instagram

 

A post shared by Malti Chahar (@maltichahar)

ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో ఒక భావోద్వేగ దృశ్యం కనిపించింది. దీపక్ చాహర్ తన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోనీ అంటే దీపక్ చాహర్‌కు ఎంత గౌరవమో మరోసారి నిరూపితమైంది. అయితే ధోనీ ఆశీస్సులు ఉన్నా అక్క వేసిన పంచ్‌ల నుండి మాత్రం దీపక్ తప్పించుకోలేకపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

మాలతీ చాహర్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అక్క అంటే ఇలాగే ఉండాలి.. మరీ అంత నిజాలు చెప్పేయకూడదు అని కొందరు కామెంట్ చేస్తుంటే, చాహర్ ఫ్యామిలీలో నవ్వుల విందు మామూలుగా లేదు అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి వాంఖడేలో మ్యాచ్ మొదలవ్వక ముందే చాహర్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో భారీ సిక్సర్ కొట్టేసింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..