Reading Time: 2 minutes

ఒరేయ్.. ఇదెక్కడి AI రా బాబూ.. అచ్చం ఒరిజినల్ చెక్ లానే ఉందిగా..!

Caption of Image.

AI టూల్స్ వచ్చాక సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే.. ఇదే క్రమంలో మరో పక్క అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోలేనంతగా పరిస్థితులు ప్రమాదకరంగా మారిపోయాయి. AI టూల్స్ వాడి ఫొటోలు, వీడియోలు జనరేట్ చేస్తున్న పబ్లిక్.. నకిలీనే అసలుదేమో అనేంత భ్రమ కలిగించేలా ఏఐ టూల్స్ పనిచేస్తున్నాయని గుర్తించలేకపోతుండటం ఆందోళన కలిగించే విషయం.

వ్యక్తిగత గోప్యత పూర్తిగా గాలికొదిలేసిన ఈరోజుల్లో.. ఏకంగా బ్యాంకు చెక్కులను కూడా AI టూల్స్ మక్కీకి మక్కీ సంతకాలతో సహా ఫోర్జరీ చేసిన తరహాలో ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చెక్కు అచ్చం అసలైనదిగా కనిపించింది. ఒక నిజమైన చెక్కుపై సాధారణంగా ఉండే ఖాతా సంఖ్య, బ్రాంచ్ వివరాలు, సంతకం చేసే ప్రదేశం, కింద MICR బ్యాండ్ వంటి వివరాలు చాట్ జీపీటీ జనరేట్ చేసిన ఏఐ ఇమేజ్ మీద కూడా ఉండటం కొసమెరుపు.

ఆధార్ కార్డ్, పాన్ కార్డులను కూడా అచ్చం ఒరిజినల్ కార్డుల మాదిరిగానే AI టూల్ జనరేట్ చేసి ఇవ్వడం నెటిజన్లలో భయాందోళనలను రేకెత్తించింది. కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఆర్థిక పత్రాలను సృష్టించడానికి ఏఐ(AI)ని ఇలా వాడితే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని కొందరు నెటిజన్లు హెచ్చరించారు. అయితే.. అసలు చెక్ పేపర్, ఆ చెక్పై కంటికి కనిపించకుండా ఇన్ విజబుల్గా ఉండే భద్రతా గుర్తులను సులభంగా కాపీ చేయలేరని పేర్కొంటూ.. భయపడాల్సిన అవసరం లేదని మరికొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు.

‘‘ఈ ఏఐ టూల్స్తో నకిలీ పత్రాలు, డీప్‌ఫేక్‌లు, పాస్‌పోర్ట్‌లు, వీసాలు వంటి ఇతర అధికారిక రికార్డులను సృష్టించడం చాలా సులభం. ఒకవేళ ఓపెన్‌సోర్స్ ఇలాంటివి సృష్టించగలిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మనుషులుగా మన పని అయిపోయినట్లే’’ అని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.