Reading Time: 2 minutes
JEE Advanced 2026 Syllabus: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 సిలబస్‌ విడుదల.. ఈసారి భారీగా సీట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష మే 17న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఐఐటీ రూర్కీ షెడ్యూల్‌ కూడా వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌ 2026 రిజిస్ట్రేషన్లు సైతం ఇప్పటికే మొదలయ్యాయి. మే 2 రాత్రి 23.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్ లో తొలి రెండున్నర లక్షల మంది ర్యాంకర్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ క్రమంలో ఐఐటీ రూర్కీ వెబ్ సైట్ లో జేఈఈ అడ్వాన్స్‌డ్ కు సంబంధించిన సిలబస్‌ విడుదల చేసింది. దీనితో పాటు 2007 నుంచి 2025 వరకు జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పాత ప్రశ్నపత్రాలను సైతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 సిలబస్‌, రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఐఐటీలు కలిపి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. గత ఏడాది దేశంలోని మొత్తం 127 విద్యా సంస్థల్లో 62,853 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సీట్లను జోసా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేశారు. ఇందులో 23 ఐఐటీల్లో 18,610 సీట్లున్నాయి. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సీట్లు భారీ సంఖ్యలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) కూడా జోసా కౌన్సెలింగ్‌లో చేరినందున ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ యూజీ కోర్సుల సీట్లు పెరిగే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణకు కలిపి మొత్తం 2 ఐఐటీలు, 2 ఎన్‌ఐటీలు, 2 ట్రిపుల్‌ఐటీలు, విజయవాడ (స్పా), హెచ్‌సీయూలో సీట్లను భర్తీ చేస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచే జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. జూన్ 1 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలవుతాయి. ఇక జూన్ 2వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్‌ మొదలవుతుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 సిలబస్‌, రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.