Reading Time: 2 minutes
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా.. కేంద్రం నుంచి కొత్త అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి తీపికబురు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ లేదా ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. వాటిల్లో ఏదైనా ఒక ఫ్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సిన అవసరముంది. అయితే ఇక నుంచి కాగితపు పని ఉండదు. పీఎఫ్ విత్ డ్రాలో పేపర్‌లెస్ ప్రక్రియకు ఈపీఎఫ్‌వో శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి మీరు పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన పని లేదు. కేవలం నిమిషాల్లోనే ఏటీఎం నుంచి తీసేసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఏటీఎం ద్వారా ఎలా తీసుకోవాలి..?

ఈపీఎఫ్‌వో ఒక ప్రత్యేక పీఎఫ్ ఏటీఎం కార్డును ఖాతాదారులందరికీ జారీ చేయనుంది. బ్యాంకులు డెబిట్ కార్డులు జారీ చేసినట్లుగానే.. పీఎఫ్ ఏటీఎం కార్డును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించనుంది. ఈ ప్రత్యేక పీఎఫ్ ఏటీఎం కార్డు ఉపయోగించి మీరు ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి అయినా మీ పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఎలా అయితే ఒక బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగించి మరో బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారో.. అదే తరహాలో పీఎఫ్ ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఏటీఎం కార్డు ఉపయోగించి కేవలం మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు నగదును మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు. నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి కొత్త చెల్లింపుల వ్యవస్థను ఈపీఎఫ్‌వో అభివృద్ది చేస్తోంది.

యూపీఐ ద్వారా విత్ డ్రా..?

ఇక యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను సెకన్లలోనే విత్ డ్రా చేసుకోవచ్చు. బీమ్ యాప్‌లో తొలుత ఈ సదుపాయం రానుండగా.. అనంతరం పేటీఎం, పేటీఎం, గూగుల్ పే లాంటి అన్ని యాప్‌లలో ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి రావాల్సి ఉండగా.. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యమైంది. మే నుంచి ఈ సుదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. యూపీఐ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75 శాతాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. మిగతా 25 శాతం మినిమం బ్యాలెన్స్ కింద ఉంచాల్సి ఉంటుంది. ఉద్యోగం మానేశాక ఈ 25 శాతం నగదును తీసుకోవచ్చు. ఇక రూ.5 లక్షల వరకు నగదును ఆటో సెటిల్మెంట్ చేసేలా ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్ తీసుకొచ్చింది.