Reading Time: < 1 minute
Raghav Chadha Resigns Aap Crisis Punjab Government Threat 7 Mps Quit

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆ పార్టీకి అత్యంత కీలకమైన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిత్తల్, సందీప్ పాఠక్ తమ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఈ పరిణామం ఢిల్లీ కంటే పంజాబ్‌లో అధిక ప్రభావాన్ని చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అవినీతి పెరిగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. మరికొంతమంది ఎంపీలు కూడా తమ దారిలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన పేర్లు చూస్తుంటే రాజ్యసభలో ఆప్ బలం దాదాపు శూన్యం కానున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాజీనామా చేసిన వారు.. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ ఉండగా, క్యూలో ఉన్న వారిని పరిశీలిస్తే.. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, సంజీవ్ అరోరా, రాజేంద్ర గుప్తా గా చెబుతున్నారు. పంజాబ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలూ తప్పుకుంటే, అది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ కానుంది.

పంజాబ్‌లో ‘మాన్’ ప్రభుత్వం గండంలో పడిందా?
ఈ ఎంపీల రాజీనామా ప్రభావం నేరుగా భగవంత్ మాన్ ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజీనామా చేసిన ఈ ఏడుగురు ఎంపీలకు మద్దతుగా పంజాబ్‌లోని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆప్ వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంపీల వెనుకాలే వారి మద్దతుదారులు కూడా బయటకు వస్తే.. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ తగ్గి ప్రభుత్వం సంక్షోభంలో పడవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతుంది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాఘవ్ చద్దాను బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. యువతలో, పట్టణ ఓటర్లలో రాఘవ్ చద్దాకు ఉన్న క్రేజ్ పంజాబ్ రాజకీయాలను మలుపు తిప్పేలా ఉంది. రాఘవ్ చద్దా, ఇతర ఎంపీల రాజీనామాతో రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాతినిధ్యం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగిన ఈ పరిణామం ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.