
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య
గోదావరిఖని, వెలుగు: సింగరేణికి చెల్లించాల్సిన రూ.52 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న చలో విద్యుత్ సౌధ కార్యక్రమం చేపడుతున్నట్లు సింగరేణి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేదరి సారయ్య, రాష్ట్ర కార్యదర్శి మెండె శ్రీనివాస్, ఆర్జీ-1 ఏరియా గౌరవాధ్యక్షుడు ఆరెపల్లి రాజమౌళి తెలిపారు. గురువారం జీడికే-1 గనిపై నిర్వహించిన కార్యక్రమంలో ఆందోళన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రూ.28 వేల కోట్ల విద్యుత్, బొగ్గును వినియోగించి సింగరేణికి చెల్లింపులు చేయలేదన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుమారు రూ.24 వేల కోట్ల విద్యుత్, బొగ్గును వినియోగించిందని చెప్పారు. మొత్తం రూ.52 వేల కోట్ల బకాయిలను వెంటనే సింగరేణికి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోతే సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతిని, మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో వంగల శివరాంరెడ్డి, పెద్దపల్లి శశికిరణ్, సాగర్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.